అనుపమకు ఝలక్.. సింపుల్‌గా 'ఆత్మపరిశీలన' అనేశాడేంటి!
రింగుల జుట్టుతో గుండెల్ని మెలిపెట్టే అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, ముగిసిన ప్రేమ బంధం గురించి చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
By: Sivaji Kontham | 17 Aug 2026 11:19 PM ISTరింగుల జుట్టుతో గుండెల్ని మెలిపెట్టే అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, ముగిసిన ప్రేమ బంధం గురించి చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన మాజీ ప్రియుడి గురించి అనుపమ సంచలన వ్యాఖ్యలతో వేడెక్కించగా.. నెటిజన్లు ఆ కామెంట్లను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో అనుపమ కలిసి పాల్గొన్న ఒక పాత పాడ్‌కాస్ట్ వీడియో క్లిప్ మళ్లీ వెలుగులోకి వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండేళ్ల పాటు ఒక నార్సిసిస్టిక్ (స్వార్థపూరిత) ... కంట్రోలింగ్ స్వభావం ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉన్నానని వెల్లడించారు. ఆ బంధంలో మానసికంగా, శారీరకంగా ఎంతో క్షోభను అనుభవించానని.. ఆ బాధ నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందేందుకు ఎంతో సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో... అనుపమ పేర్కొన్న ఆ మాజీ ప్రియుడు `బైసన్` సినిమాలో తనతో కలిసి నటించిన ధృవ్ విక్రమే అయి ఉంటాడని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొదలైంది.
ఈ నెగెటివ్ ప్రచారానికి తోడు 2025లో వీరిద్దరూ కలిసి పాల్గొన్న ఒక యూట్యూబ్ పాడ్‌కాస్ట్ వీడియో క్లిప్ ప్రచారంలోకి వచ్చింది. ఆ పాడ్‌కాస్ట్‌లో అనుపమ సరదాగా మాట్లాడుతూ.. `బైసన్` సినిమా ప్రమోషన్ల సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలను ధృవ్ మాత్రమే ఎంపిక చేసేవాడని.. తాము ఏ ఫోటోలు పోస్ట్ చేయాలో కూడా ఆయనే నిర్ణయించేవాడని చెప్పింది. అప్పట్లో సరదాగా సాగిన ఈ సంభాషణను ఇప్పుడు నెటిజన్లు ధృవ్ ఆధిపత్య మనస్తత్వం- కంట్రోలింగ్ స్వభావానికి నిదర్శనంగా చూపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
దీనికి తోడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా పరిచయమైన `ఆదిత్య వర్మ`(అర్జున్ రెడ్డి రీమేక్) చిత్రంలోని కంట్రోలింగ్ ప్రేమికుడి పాత్రతో కూడా పలువురు నెటిజన్లు అతడి నిజ జీవిత ప్రవర్తనను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. గతంలో అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వీయ స్వేచ్ఛ, మానసిక ఉపశమనం గురించి పెట్టిన వరుస పోస్టులు కూడా ఈ ప్రేమకథ విఫలం కావడం వల్లేనని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ రూమర్లపై అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన తదుపరి చిత్రం `క్రేజీ కళ్యాణం` టీజర్ లాంచ్ వేదికగా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులు కేవలం తన వ్యక్తిగత పురోగతికి, ఒక మహిళగా తన ఆలోచనలలో వచ్చిన మార్పులకు సంకేతమే తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనను బాధపెట్టిన ఆ మాజీ ప్రియుడి పేరును అనుపమ ఎక్కడా అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. ఒక పెద్ద హీరో కుమారుడు గనుకనే అనుపమ ఈ పేరును రివీల్ చేయడం లేదని ఇప్పుడు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
సింపుల్‌గా ఆత్మపరిశీలన అనేశాడు!
తాజాగా `ఇండియా టుడే తమిళనాడు రౌండ్‌టేబుల్` కార్యక్రమంలో ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ.. అనుపమ గత వ్యాఖ్యలనుద్ధేశించి నర్మగర్భంగా కామెంట్ చేసాడు. అతడి ప్రకారం.. ఇటువంటి పబ్లిక్ పరిశీలన, ప్రచారాలు తనను ప్రభావితం చేయలేదని చెప్పలేనని.. అయితే వ్యక్తిగతంగా ఆత్మపరిశీలన చేసుకుంటూ... తనకు అత్యంత సన్నిహితులైన వారి మద్దతుతో ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పరుచుకుని.. నిజాయితీగా జీవించడం ద్వారానే ఇలాంటి బాహ్య ఒత్తిళ్లను తట్టుకోగలుగుతున్నానని స్పష్టం చేశారు.
