ఫోటోలు మార్ఫింగ్‌లో అసలు నిజం తెలుసుకుని షాకైన అనుపమ
రీసెంట్ టైమ్స్ లో ఇంటర్నెట్ ను విచ్చలవిడిగా వాడటం బాగా అలవాటుగా మారిపోయింది. ఇంటర్నెట్ ను వాడుతూ ఎలాంటి భయం లేకుండా ఎంతకైనా తెగించడం చాలా కామనైపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Nov 2025 6:50 PM ISTరీసెంట్ టైమ్స్ లో ఇంటర్నెట్ ను విచ్చలవిడిగా వాడటం బాగా అలవాటుగా మారిపోయింది. ఇంటర్నెట్ ను వాడుతూ ఎలాంటి భయం లేకుండా ఎంతకైనా తెగించడం చాలా కామనైపోయింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్ల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ల ఫోటోలను డిపీలుగా పెట్టుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.
కొందరు.. సెలబ్రిటీల ఫేమ్ ను వాడుకుంటూ మోసం చేస్తుంటే, మరికొందరు సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్ లో వైరల్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ దారుణాలు పెరిగిపోయాయి. అందుకే వాటిని భరించలేక సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేయడం, కోర్టుకు వెళ్లడం లాంటివి చేస్తున్నారు.
పోలీసులను ఆశ్రయించిన అనుపమ
ఇప్పుటు సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. అనుపమ ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అకౌంట్స్ కు ట్యాగ్ చేస్తుండటం ఎక్కువవడంతో అనుపమ ఈ విషయంపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందిస్తూ అనుపమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తన గురించి అలా అసభ్యకర పోస్టులు చేసిందెవరో తెలిసిపోయిందంటూ పోస్ట్ చేశారు.
అనుపమపై 20 ఏళ్ల అమ్మాయి ట్రోలింగ్
ఆ పోస్ట్ లో అనుపమ ఇలా రాసుకొచ్చింది. కొన్నాళ్ల కిందట తన గురించి తప్పుడు వార్తలను, మార్ఫింగ్ ఫోటోలను పంచుతున్న ఓ అకౌంట్ కనిపించిందని, అదే వ్యక్తి ఎన్నో ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్ చేసి, తనపై అవమానకార కామెంట్స్ చేస్తూ హేట్రెడ్ ను స్పెడ్ చేశారని, దీంతో తాను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, విచారణలో ఇదంతా చేస్తున్నది ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తెలిసి తాను షాకైనట్టు అనుపమ రాసుకొచ్చారు.
సెలబ్రిటీలకు కూడా హక్కులుంటాయి
ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని ఆమె ఎవరనేది తాను బయటపెట్టాలనుకోవడం లేదని, కానీ చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకుంటానని చెప్పిన అనుపమ, సెలబ్రిటీలకు కూడా సాధారణ మనుషుల్లానే హక్కులుంటాయని, ఆన్‌లైన్ వేధింపులు శిక్షార్హ నేరమని పేర్కొన్నారు. ఈ విషయం ద్వారా తానో విషయం చెప్పాలనుకుంటున్నానని, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కు యాక్సెస్ ఉన్నంత మాత్రాన ఇతరులను వేధించడం, వారి పరువు తీస్తూ, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదని, ఆన్ లైన్ లో చేసే ప్రతీ పనికి జవాబుదారీతనం తప్పదని అనుపమ చెప్పారు. ఇక అనుపమ కెరీర్ విషయానికొస్తే ఈ ఇయర్ అనుపమ ఏకంగా ఆరు సినిమాలు చేసింది. త్వరలో అనుపమ లాక్‌డౌన్ అనే తమిళ సినిమాలో కనిపించనున్నారు.
