వరుస రిస్క్‌లు.. అనుపమ ప్లాన్ ఇదేనా?
గత కొంతకాలంగా నటిగా తన సత్తాను చాటే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా రిలీజైన మరీచిక కూడా అదే లిస్ట్ లో చేరింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అందులో అనుపమ చేసిన పాత్ర మాత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Jun 2026 12:56 PM ISTహీరోయిన్ల కెరీర్‌లో సేఫ్ జోన్‌లో కొనసాగడం చాలా సాధారణ విషయం. ముఖ్యంగా స్టార్ ఇమేజ్, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు లేదా కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఆ మార్గానికి భిన్నంగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. కెరీర్ మొదట్లో పక్కింటి అమ్మాయి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ, గత కొంతకాలంగా నటిగా తన సత్తాను చాటే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా రిలీజైన మరీచిక కూడా అదే లిస్ట్ లో చేరింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అందులో అనుపమ చేసిన పాత్ర మాత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరీచికలో అనుపమ పోషించిన వెంకటలక్ష్మి పాత్ర సాధారణ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. ఒకవైపు అమాయకంగా కనిపించే యువతిగా, మరోవైపు పూర్తిగా భిన్నమైన కోణాన్ని కలిగిన వ్యక్తిగా డైరెక్టర్ ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ఆడియన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఓ వైపు పళ్లకు క్లిప్స్, కళ్లద్దాలతో కనిపించే లుక్, మరోవైపు మోడరన్ లుక్‌లోని వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. అంతేకాదు, మానసిక సంఘర్షణలతో బాధపడుతున్న యువతిగా ఒక సందర్భంలో కనిపిస్తే, మరో సందర్భంలో పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకున్న తెలివైన వ్యక్తిలా కనిపించడం అనుపమ నటనకు మరో పరీక్షగా నిలిచింది. ఈ రెండు షేడ్స్‌ను తెరపై సమర్థంగా ప్రదర్శించడంలో ఆమె బాగా సక్సెస్ అయిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది.
ఈ మధ్య అనుపమ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులను పరిశీలిస్తే, ఆమె స్పష్టంగా ఒక పెర్ఫార్మర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కార్తికేయ2, కిష్కిందపురి సక్సెస్‌ల తర్వాత కూడా పూర్తిగా కమర్షియల్ ఫార్ములాకు పరిమితం కాకుండా, పరదా, బైసన్, లాక్‌డౌన్, ఇప్పుడు మరీచిక లాంటి విభిన్న కథల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ చుట్టూనే కథ తిరుగుతూ, యాక్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యముండే పాత్రలను ఎంచుకోవడం ఆమె కెరీర్‌లో కొత్త అధ్యాయంగా భావించవచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో కేవలం సాంగ్స్, రొమాన్స్‌కు పరిమితమయ్యే పాత్రల కంటే సవాళ్లు విసిరే పాత్రల వైపే ఆమె ఆసక్తి చూపడం విశేషం.
సాధారణంగా హీరోయిన్లు తమ కెరీర్ సజావుగా వెళ్తున్న టైమ్ లో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ అనుపమ మాత్రం ఆ భయాన్ని పక్కనబెట్టి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనుపమ చేసిన సినిమాలు కొన్నిసార్లు కమర్షియల్ గా పెద్ద సక్సెస్‌లు సాధించకపోయినా, నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. మరీచిక విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత మేర ప్రభావం చూపుతుందో చెప్పడం ఇప్పుడే కష్టమే అయినా, సినిమాలో అనుపమ యాక్టింగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
అందుకే మరీచికను కేవలం మరో సినిమాలా కాకుండా, అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌లో ఒక కీలక మలుపుగా సినీ విశ్లేషకులు చూస్తున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, బలమైన పాత్రలను మోసే నటిగా తన స్థాయిని మరింత బలపరుచుకునే దిశగా అనుపమ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగాల పరంపర కొనసాగితే, ఫ్యూచర్ లో అనుపమను కేవలం కమర్షియల్ హీరోయిన్‌గా కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు నమ్మకమైన నటిగా గుర్తించే రోజు దూరంలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
