Begin typing your search above and press return to search.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి!

టాలీవుడ్ - మాలీవుడ్ ప్రేక్షకులను అభినయంతో అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ల సమయంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించినట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 4:00 AM IST
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి!
X

టాలీవుడ్ - మాలీవుడ్ ప్రేక్షకులను అభినయంతో అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ల సమయంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించినట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మీడియా ముందు ఒక్కసారిగా కన్నీరు పెట్టుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొందరు దీనిని సినిమా పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని తప్పుగా భావించారు.

తాను వేదికపై ఏడ్చింది ఎలాంటి ప్రచారం కోసం కాదని నిజమైన మానసిక క్షోభ వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని అనుపమ తాజాగా స్పష్టం చేశారు. మాజీ ప్రియుడు తనను ఉద్దేశపూర్వకంగా స్లట్-షేమింగ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌లో ముందుకు వెళ్తున్న సమయంలో కొందరి నుండి ఇలాంటి వేధింపులు ఎదురుకావడం తనను మానసికంగా కుంగదీసిందన్నారు. ఒక మహిళా నటిగా సమాజంలో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కొనేటప్పుడు కలిగే మానసిక వేదన మాటల్లో వర్ణించలేనిదని పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న మహిళలపై ఇలాంటి మానసిక దాడులు చేయడం సులభమని కానీ వాటి వెనుక ఉండే బాధ చాలా తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తనపై జరిగిన దుష్ప్రచారం కేవలం వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా త‌న ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాగిందని వాపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి వాస్తవాలను బయట పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రమోషన్ల సమయంలో జరిగిన సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు.

ఇలాంటి దుర్వినియోగాలు - వేధింపులు తన ఒక్కరికే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది మహిళా నటులు ఎదుర్కొంటున్న సమస్య అని అనుపమ పేర్కొన్నారు. నటీమణుల గ్లామర్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం దారుణమని మండిపడ్డారు. సమాజంలో మహిళల పట్ల ఉండే ఇలాంటి చిన్నచూపు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని బలంగా నొక్కిచెప్పారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతానని అనుస‌మ‌ స్పష్టం చేశారు.

ఈ సంఘటన తర్వాతే తాను నార్సిసిస్టిక్ దుర్వినియోగం -మానసిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మనల్ని అణచివేయాలని చూసే వారిపై భయపడి వెనకడుగు వేయకుండా, ధైర్యంగా ఎదురు నిలవడమే సరైన సమాధానమని అనుపమ నిరూపించారు. ప్రస్తుతం ఈ విష‌యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు -తోటి నటీనటులు ఆమెకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు.