Begin typing your search above and press return to search.

సుకుమార్ ను భయపెట్టిన అనుపమ.. ఈసారి క్లిక్కయ్యేనా?

రంగస్థలం సినిమాలో రాంచరణ్ పక్కన 'రామలక్ష్మి' క్యారెక్టర్ కు ముందుగా ఎవరిని అనుకున్నారో టాలీవుడ్ లో చాలామందికి తెలుసు.

By:  M Prashanth   |   14 Oct 2026 2:00 PM IST
సుకుమార్ ను భయపెట్టిన అనుపమ.. ఈసారి క్లిక్కయ్యేనా?
X

రంగస్థలం సినిమాలో రాంచరణ్ పక్కన 'రామలక్ష్మి' క్యారెక్టర్ కు ముందుగా ఎవరిని అనుకున్నారో టాలీవుడ్ లో చాలామందికి తెలుసు. ఆడిషన్స్ వరకు వెళ్లిన అనుపమ పరమేశ్వరన్ ను కాదని దర్శకుడు సుకుమార్ చివరకు సమంతను ఫిక్స్ చేశారు. ఆ రోజుల్లో ఆడిషన్ లో డైలాగులు చెబుతూ అనుపమ పదే పదే వాళ్ల అమ్మ వైపు చూడటంతో, షూటింగ్ లోనూ ఇలాగే చేస్తే కష్టమని సుకుమారే స్వయంగా ఓ ఈవెంట్ లో ఓపెన్ అయ్యారు. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

ఆ తర్వాత సమంత రామలక్ష్మిగా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరూ చూశారు. అటు అనుపమ కూడా లవ్ స్టోరీలు, యూత్ ఫుల్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ సెట్ చేసుకుంది. అయితే సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ చేతుల మీదుగా రావాల్సిన ఒక రస్టిక్ రోల్ మిస్సయిందనే ఫీలింగ్ మాత్రం ఆమె ఫ్యాన్స్ లో ఎక్కడో ఉండిపోయింది. ఆ లోటును భర్తీ చేసే సమయం ఇన్నాళ్లకు వచ్చినట్లు కనిపిస్తోంది.

శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'భోగి' సినిమాలో అనుపమ లుక్ చూశాక పాత రంగస్థలం ముచ్చట మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో ఆమె 'కందుల సులోచనా రాణి' అనే పక్కా నేటివిటీ ఉన్న పాత్ర చేస్తోంది. కాళ్లకు చెప్పులు లేకుండా, తలపై మోదుగ ఆకుల బుట్ట పెట్టుకుని, విస్తరాకులు కుట్టే పేదింటి పల్లెటూరి అమ్మాయిగా విడుదలైన ఫస్ట్ లుక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. గ్లామర్ హంగులేవీ లేకుండా పూర్తి డీగ్లామ్ అవతారంలో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

మొన్నటివరకు 'టిల్లు స్క్వేర్'లో లిల్లీగా ఊహించని గ్లామర్, బోల్డ్ క్యారెక్టర్ తో యూత్ ను మెస్మరైజ్ చేసిన అనుపమ.. ఒక్కసారిగా ఇలాంటి రా అండ్ రస్టిక్ రోల్ లోకి మారిపోవడం పెద్ద ట్రాన్స్ ఫర్మేషన్ అనే చెప్పాలి. మోడ్రన్ అమ్మాయిగా స్క్రీన్ పై ఎంత ఈజీగా నటిస్తుందో, లోకల్ విలేజ్ క్యారెక్టర్ లోనూ అంతే సహజత్వాన్ని చూపించగలననే ధీమాను ఈ లుక్ తో హైలెట్ చేసింది.

నెటిజన్లు కూడా వెంటనే దీన్ని నాటి రామలక్ష్మి ఆడిషన్ తో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు అమ్మ వైపు చూసిందనో లేక పల్లెటూరి పాత్రలను హ్యాండిల్ చేయలేదనో సుకుమార్ లైట్ తీసుకున్న ఆ యాంగిల్ ను.. సంపత్ నంది ఇప్పుడు ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనే ఆసక్తి పెరిగింది. అనుపమలోని ఆ రా టాలెంట్ ను బయటకు తీయడంలో భోగి ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.

అనుపమతో భవిష్యత్తులో తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఆనాడు సుకుమార్ ఇచ్చిన మాట ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ, ప్రస్తుతం సులోచనా రాణిగా ఆమె చూపిస్తున్న వేరియేషన్ మాత్రం కెరీర్ కు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది. కానీ సంపత్ నంది ఈమధ్య కాలంలో పెద్దగా మ్యాజిక్ చేసింది లేదు. అతని గత సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ లోనే హైలెట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు అనుపమ పాత్రను ఎలా చూపిస్తాడనేది అసలు విషయం. శర్వానంద్ జోడిగా ఇప్పటికే అనుపమ శతమానం భవతితో హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా థియేటర్లలో క్లిక్ అయితే, అనుపమ పక్కా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలకూ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేసుకున్నట్లే.