రెండేళ్లు నరకం చూశాను.. బ్రేకప్ పై అనుపమ ఏమన్నారంటే?
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 13 Aug 2026 3:51 PM ISTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండి 'నార్సిసిస్టిక్ అబ్యూజ్'కు గురయ్యానని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రేమ పేరుతో ఆంక్షలు:
ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి, నన్ను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడని అనుపమ చెప్పింది. ఇక తాను ధరించే దుస్తులు, సోషల్ మీడియా పోస్టులు, చివరికి ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆయనే ఆంక్షలు విధించేవాడని తెలిపింది. అంతేకాకుండా, అసలు నటనకు స్వస్తి పలకాలని కూడా తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
3 నెలల్లోనే ఎంగేజ్‌మెంట్ ఒత్తిడి:
పరిచయమైన కేవలం మూడు నెలలకే ఆయన కుటుంబం నిశ్చితార్థం, వివాహం చేసుకోవాలని బలవంతం చేశారని అనుపమ బయటపెట్టింది. ఇక ఆ వ్యక్తి వయసులో చాలా చిన్నవాడని, అది ప్రేమ కంటే తనను పూర్తిగా నియంత్రించే ప్రయత్నంగా అనిపించడంతో తాను ఆ ప్రతిపాదనను వాయిదా వేస్తూ వచ్చానని వివరించింది. ఇక ఆ బంధంలో తనకు ఏమాత్రం స్వేచ్ఛ లేకపోవడంతో మానసికంగా నలిగిపోయానని పేర్కొంది.
క్యారవాన్‌లో ఏడ్చేదాన్ని:
ఈ విషపూరితమైన బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఆందోళనకు గురై బరువు కూడా తగ్గానని అనుపమ చెప్పింది. ఇక షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్నని, తరచూ పానిక్ ఎటాక్స్‌కు గురయ్యేదాన్నని తెలిపింది. చివరికి తన సొంత తమ్ముడిని తాకడానికి కూడా భయపడేంతగా ఆ వ్యక్తి తనను మానసికంగా వేధించాడని ఆవేదన చెందింది.
‘డ్రాగన్’ ప్రమోషన్లకు దూరంగా:
తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ మానసిక వేదన కారణంగానే హాజరు కాలేకపోయానని అనుపమ గుర్తుచేసుకుంది. ఆ వ్యక్తి తన్ను డ్రాగన్ ప్రమోషన్లకు వెళ్లనివ్వలేదని సంచలన నిజం బయటపెట్టింది. ఇక చాలా కాలం తర్వాత ఈ మానసిక గాయం నుంచి కోలుకున్నానని, తన అనుభవం ఇతరులకు ఒక హెచ్చరికగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బహిర్గతం చేశానని అనుపమ స్పష్టం చేసింది.
అనుపమ చేసిన ఈ షాకింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, అలాంటి విషపూరిత బంధం నుంచి బయటపడి మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టి ధైర్యంగా ముందుకు సాగుతున్న అనుపమను అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
