లాక్ డౌన్ విషయంలో అనుపమ మౌనానికి కారణమేంటి?
అయితే ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా, ఆ ప్రమోషన్స్ లో సదరు చిత్రంలో నటించిన నటీనటులు పాల్గొనకపోతే ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jan 2026 1:56 PM ISTసినీ ఇండస్ట్రీలో పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ సినిమాకైనా ప్రమోషన్లు చాలా కీలకంగా మారాయి. సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేస్తే అది ఆడియన్స్ లోకి అంత ఎక్కువగా వెళ్తుందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ప్రమోషన్స్ బాగా చేసి, సినిమాపై హైప్ క్రియేట్ చేస్తే మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సినిమాలు ప్రూవ్ కూడా చేశాయి. అందుకే ప్రతీ ఒక్కరూ తమ తమ సినిమాల్ని ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
జనవరి 30న లాక్‌డౌన్ రిలీజ్
అయితే ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా, ఆ ప్రమోషన్స్ లో సదరు చిత్రంలో నటించిన నటీనటులు పాల్గొనకపోతే ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. పైగా లేని పోని వార్తలు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు సినిమా కంటే ఆ లేనిపోని వార్తల వైపే దృష్టి మరలిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఏఆర్ జీవా డైరెక్టర్ గా పరిచయమవుతున్న సినిమా లాక్‌డౌన్.
బజ్ లేకుండానే రిలీజ్
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల పలు వాయిదాలు పడి ఆఖరికి జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు బజ్ చాలా తక్కువ ఉంది. పైగా లైకా ప్రొడక్షన్స్ లాంటి సంస్థ మద్దతు ఉన్నప్పటికీ చెన్నై తప్ప మిగిలిన మెయిన్ సిటీల్లో కూడా ఈ సినిమాకు ఎలాంటి షో లు కేటాయించలేదు.
ఎలాంటి ప్రమోషన్స్ చేయని అనుపమ
ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా విషయంలో అనుపమ పరమేశ్వరన్ సైలెంట్ గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కానీ, దానికి ముందు కానీ, ఈ సినిమా గురించి అనుపమ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసింది లేదని, లైకా ప్రొడక్షన్ ప్రమోషన్స్ విషయంలో తమ వంతు కష్టం తాము పడుతున్నప్పటికీ, అనుపమ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడమేంటనేది అందరినీ ఆలోచనలో పడేసింది. ఇవన్నీ చూస్తుంటే అనుపమకు, చిత్ర యూనిట్ కు మధ్య ఏదైనా ప్రాబ్లమ్ ఉందే అనే విధంగా కూడా అనుమానాలొస్తున్నాయి. మరి ఈ విషయంలో అనుపమ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
