అనుపమ 'కాకా ధూమ్ ధమాకా'.. ప్రతి ఊరిలో మోగడం పక్కానేమో!
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ కళ్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
By: M Prashanth | 12 Sept 2026 11:02 PM ISTపెళ్లి బరాత్ మొదలైతే డీజే సౌండ్ ఎలా దద్దరిల్లిపోతుందో.. క్రేజీ కళ్యాణం మూవీ నుంచి వచ్చిన కాకా ధూమ్ ధమాకా కూడా అదే రేంజ్ లో ఉంది. పక్కా తెలంగాణ పల్లెటూరి పెళ్లి వాతావరణం.. ఊరమాస్ బీట్స్.. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మాస్ స్టెప్పులు.. అన్నీ కలిపి పాటను ఫుల్ జోష్ లో దింపేశారు మేకర్స్. దీంతో సాంగ్ చూస్తుంటే.. త్వరలో జరగనున్న పెళ్లిళ్లలో డీజే బాక్సుల నుంచి కాకా ధూమ్ ధమాకా మోత వినిపించడం ఖాయమే అనిపిస్తోంది.
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ కళ్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దెమరి, వీకే నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెళ్లి చుట్టూ జరిగే సరదా సంఘటనలతో ఆ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచిన మేకర్స్.. ఇప్పుడు పాటలతో మరింత సందడి మొదలుపెట్టారు.
అందులో భాగంగా కాకా ధూమ్ ధమాకా సాంగ్ ను రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టే పాట మొదలైన దగ్గర నుంచి ఫుల్ ధూమ్ ధమాకానే. పెళ్లి వేడుకలో జరిగే అల్లరి, సందడి, డ్యాన్సులను పక్కా తెలంగాణ నేటివిటీతో చూపించారు. ముఖ్యంగా పాటలో అనుపమ లుక్, డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పక్కా పెళ్లికూతురు గెటప్ లో కనిపించిన ఆమె.. మాస్ స్టెప్పులతో ఓ రేంజ్ లో సందడి చేసింది.. ఆమె డ్యాన్స్‌కు తరుణ్ భాస్కర్ కూడా యాడ్ అవ్వడంతో పాటలో మరింత ఫన్ కనిపించింది.
టీజర్ లో కనిపించిన ఫ్యామిలీ కామెడీకి ఇప్పుడు లేటెస్ట్ సాంగ్ మరో డోస్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసినట్లుగా ఉంది. కాకా ధూమ్ ధమాకాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. జంగి రెడ్డి పాటను పాడారు. బీట్స్, వాయిస్, తెలంగాణ నేటివిటీకి తగ్గ సాహిత్యం కలిసి సాంగ్ కు మంచి మాస్ ఫీల్ తీసుకొచ్చాయి. విడుదలైన వెంటనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
ఇక క్రేజీ కళ్యాణం మూవీలో అనుపమ పరమేశ్వరన్ కీర్తి రోల్ లో కనిపించనుంది. పెళ్లి చేసుకోవాలనే ఆరాటంలో ఉండే కూతురు ఒకవైపు.. ఎలాగైనా కూతురికి పెళ్లి చేయాలని చూసే తండ్రి మరోవైపు. వీళ్ల చుట్టూ జరిగే సంఘటనలతో కథలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిపారు. తెలంగాణ యాస, పల్లెటూరి వాతావరణం ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలవనుంది. మరి కాకా ధూమ్ ధమాకా సాంగ్ కు థియేటర్లలో ఆడియన్స్ ఏ రేంజ్ లో స్టెప్పులేస్తారో చూడాలి. అంతకంటే ముందు మాత్రం ప్రతి ఊరిలో పెళ్లి బరాత్ లో కాకా ధూమ్ ధమాకా మోగేలా కనిపిస్తోంది!
