వెండి తెరపై విలన్ గా చరిత్ర సృష్టించిన పాత్రకు 40 ఏళ్లు!
బాలీవుడ్‌లో అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఓ ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేసుకున్నారు.
By: Srikanth Kontham | 9 Aug 2026 4:00 AM ISTబాలీవుడ్‌లో అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఓ ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేసుకున్నారు. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం `కర్మ` విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో అనుపమ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఎంతగానో ఉపయోగపడిందని, కమర్షియల్ స్టార్‌గా తనను నిలబెట్టిందని పేర్కొన్నారు.
మహేష్ భట్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `సారాంశ్` చిత్రం తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేసిందని.. కానీ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన `కర్మ` చిత్రం తనను మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా ప్రపంచం లోకి తీసుకువెళ్లిందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆ చిత్రంలో అనుపమ్ పోషించిన ప్రతినాయక పాత్ర `డాక్టర్ డాంగ్` ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ కాలంలో ఆ సినిమా సాధించిన ఘన విజయం తన కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని సంతోషం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించడం తన జీవితంలో లభించిన గొప్ప బహుమతి అని అనుపమ్ ఖేర్ కొనియాడారు. ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన నటనను దగ్గరి నుంచి గమనించడం, ఆయన మౌనం ,హావభావాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం తనకు నిజమైన అవార్డులాంటిదని భావోద్వేగానికి లోనయ్యారు. తనపై నమ్మకం ఉంచి అంతటి అద్భుతమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు సుభాష్ ఘాయ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
1986లో విడుదలైన `కర్మ` చిత్రంలో దిలీప్ కుమార్‌తో పాటు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, నసీరుద్దీన్ షా, శ్రీదేవి వంటి ప్రముఖ తారాగణం నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా అప్పట్లో సంచలన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రంలోని `ఇస్ థప్పడ్ కి గూంజ్ సుని తుమ్నే, డాక్టర్ డాంగ్?` వంటి డైలాగ్‌లు ఇప్పటికీ సినీ ప్రేమికులకు గుర్తిండిపోయేలా నిలిచాయి.
తాజాగా కెరీర్‌లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అనుపమ్ ఖేర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన కల్ట్ క్లాసిక్ సినిమా `ఖోస్లా కా ఘోస్లా`కు సీక్వెల్ అయిన `ఖోస్లా కా ఘోస్లా 2` షూటింగ్‌ను పూర్తి చేశారు. వయసుతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ నటనపై తనకున్న అంతులేని ప్రేమను నిరూపించుకుంటూనే ఉన్నారు.
నటుడిగా చిన్న చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టి భారీ కమర్షియల్ చిత్రాల ద్వారా అగ్ర హీరోల సరసన మెప్పించిన అనుపమ్ ఖేర్ ప్రయాణం నేటి యువ నటులకు ఎంతో స్ఫూర్తిదాయకం. `కర్మ` సినిమా అందించిన జ్ఞాపకాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. ఈ చారిత్రాత్మక విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి అనుపమ్ శుభాకాంక్షలు తెలిపారు.
