'అనుమాన పక్షి'కి కాశ్మీర్ నుంచి కాల్స్.. టీజర్ ఇంట్రెస్ట్ పెంచేలా..
యంగ్ హీరో రాగ్ మయూర్ లీడ్ రోల్ లో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఎంటర్టైనింగ్ మూవీ అనుమాన పక్షి.
By: M Prashanth | 9 Jun 2026 12:00 PM ISTయంగ్ హీరో రాగ్ మయూర్ లీడ్ రోల్ లో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఎంటర్టైనింగ్ మూవీ అనుమాన పక్షి. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, రాశి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ ను చూస్తే.. ప్రతి విషయాన్ని కూడా అనుమానించే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ప్రతి దాన్ని కూడా డౌట్ తో చూసే హీరో బిహేవియర్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఇబ్బందిగా మారినట్లు చూపించారు. అతడి అనుమాన బుద్ధి వల్ల తల్లిదండ్రులు ఎదుర్కొనే పరిస్థితులను ఫన్నీగా చూపించినట్లు టీజర్ లో కనిపిస్తోంది.
అయితే హీరో పెళ్లి నేపథ్యంలో కథ మరింత ఆసక్తికరంగా మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడి బుద్ధి తెలుసుకున్నప్పటికీ ఓ యువతి ఓకే చెప్పడం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కథలో ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా "కాశ్మీర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఇప్పుడేం చేయాలి?" అనే డైలాగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ డైలాగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటన్న ఇంట్రెస్ట్ టీజర్ రేకెత్తించింది.
ఇక నటుడు అజయ్ పోలీస్ అధికారిగా కనిపిస్తూ కథలో ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ను తీసుకువచ్చారు. అజయ్, రాశి పాత్రల మధ్య వచ్చే సీన్స్ ఫన్ అందించేలా ఉండనున్నాయని టీజర్ ద్వారా అర్థమవుతోంది. రాగ్ మయూర్ తన పాత్రలో నేచురల్ గా కనిపిస్తూ, ప్రతి విషయాన్ని కూడా అనుమానించే వ్యక్తిగా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు. సినిమాలో డార్క్ కామెడీ, హారర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
కథను కొత్త తరహాలో చెప్పేందుకు దర్శకుడు విమల్ కృష్ణ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. పాత్రల ఆధారంగా వచ్చే కామెడీ, మిస్టరీ ఎలిమెంట్స్ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ ముందుకు తీసుకెళ్తోంది.
ఇటీవలే సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన మేకర్స్, పలు సాంగ్స్ ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఆ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏదేమైనా టీజర్ తో సినిమా కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కామెడీ, సస్పెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న అనుమాన పక్షి కొత్త ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి త్వరలోనే సినిమా థియేటర్లలోకి రానుండగా, టీజర్ మాత్రం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచిందనే చెప్పాలి.
