ఆ బజ్ ఏమైంది అనుదీప్?
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెన్నెల కిషోర్ లేదా బ్రహ్మానందం లాంటి కమెడియన్ల కోసం జనాలు థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఒక దర్శకుడి కామెడీ స్టైల్ చూసి యువత ఎగబడటం ‘జాతిరత్నాలు’ సినిమాతోనే మొదలైంది.
By: M Prashanth | 14 Feb 2026 3:55 PM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు వెన్నెల కిషోర్ లేదా బ్రహ్మానందం లాంటి కమెడియన్ల కోసం జనాలు థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఒక దర్శకుడి కామెడీ స్టైల్ చూసి యువత ఎగబడటం ‘జాతిరత్నాలు’ సినిమాతోనే మొదలైంది. కరోనా కష్టకాలంలో ఆ సినిమా తెచ్చిన నవ్వులు అనుదీప్ కేవీని ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీని చేసేశాయి. అప్పట్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనుదీప్ ఇంటర్వ్యూలు, ఆయన నాన్ సింక్ జోకులే ట్రెండింగ్‌లో ఉండేవి. ఆ క్రేజ్ చూసి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు సైతం ఆయన వెంటే పడ్డాయి.
నిజానికి ‘జాతిరత్నాలు’ టైమ్‌లో థియేటర్ల దగ్గర కనిపించిన ఆ హడావుడి మరే చిన్న సినిమాకు దక్కలేదు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు రావడమే కాకుండా, అనుదీప్ ఒక బ్రాండ్‌గా ఎదిగారు. కానీ ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలపై బజ్ క్రమంగా మారుతూ వస్తోంది. ప్రేక్షకులు ఏదో కొత్తగా ఆశిస్తుంటే, ఒకే రకమైన ఫార్ములా కనిపిస్తుండటంతో అంచనాలు తలకిందులవుతున్నాయి. మొదటి సినిమా ఇచ్చిన కిక్కుతో పోలిస్తే, ప్రస్తుత సినిమాల విషయంలో థియేటర్ల వద్ద ఆ సందడి కనిపించడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫంకీ పెద్దగా సౌండ్ చేయడం లేదు. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబో అనగానే మొదట్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది కానీ, రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న సౌండ్ ఆ అంచనాలకు ఏమాత్రం మ్యాచ్ అవ్వడం లేదు. షూటింగ్ మొదలైనప్పుడు ఉన్న హైప్, ఇప్పుడు థియేటర్ల దగ్గర ఉన్న పరిస్థితి చూస్తుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఒక క్రేజీ కాంబినేషన్ నుండి ఆశించిన స్థాయిలో పబ్లిక్ లో హడావుడి క్రియేట్ చేయలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఒకప్పుడు అనుదీప్ ఇంటర్వ్యూ క్లిప్స్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించేవి. కానీ ఇప్పుడు అదే స్టైల్ వెటకారం వింటుంటే జనాలకు మునుపటి అంత క్యూరియసిటీ కలగడం లేదేమో అనే సదేహం వస్తోంది. సినిమా ప్రమోషన్లలో ఎంత హడావుడి చేసినా, ఆ ప్రభావం బుకింగ్స్ మీద పడకపోవడం గమనార్హం. ‘జాతిరత్నాలు’ టైమ్‌లో ఉన్న ఆ ఊపు ఇప్పుడు ‘ఫంకీ’ విషయంలో ఎక్కడో తేడా కొడుతోంది. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఈసారి ఎక్కడో గ్యాప్ వచ్చిందన్నది వాస్తవం.
కేవలం వన్ లైనర్లను నమ్ముకుని సినిమా మొత్తాన్ని నడిపించేయడం అన్ని సార్లు వర్కవుట్ కాదని ఇప్పుడు వినిపిస్తున్న టాక్. విశ్వక్ సేన్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి అనుదీప్ కోసం కొత్తగా ట్రై చేసినా, అది బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోయింది. ఒకప్పుడు అనుదీప్ పేరు వింటే చాలు నవ్వులు గ్యారెంటీ అనుకున్న యువత, ఇప్పుడు ఆయన సినిమా అంటేనే కాస్త ఆలోచిస్తున్నారనేది థియేటర్ల దగ్గర ఉన్న ఖాళీ సీట్లు చెబుతున్నాయి. ఏదేమైనా అనుదీప్ కేవీ తన కామెడీ టోన్ మార్చుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. మరి ఈ ‘ఫంకీ’ రిజల్ట్ తర్వాత అనుదీప్ తన తదుపరి ప్రాజెక్ట్‌తోనైనా మళ్ళీ ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.
