Begin typing your search above and press return to search.

అందుకే వరుస సినిమాలు చేయలేదు..

అలా కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత పాత్రలతో ఆకట్టుకోవాలని చూస్తున్న వారిలో నేను కూడా ఒకరు అంటోంది అను ఇమ్మాన్యుయేల్..

By:  Madhu Reddy   |   12 Nov 2025 3:00 PM IST
అందుకే వరుస సినిమాలు చేయలేదు..
X

సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం అనేది అంత సులభం కాదు.. కొంతమందికి అదృష్టం వరించి వరుస అవకాశాలు వస్తే.. మరికొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అవకాశాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమంది కమర్షియల్ సినిమాలలో నటించడం ఇష్టం లేక కథకు ప్రాధాన్యతనిస్తూ.. సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు తెలియక సినీ ప్రేక్షకులు మాత్రం ఎందుకో వారికి అవకాశాలు రావడం లేదు అంటూ చెవులు కొరుక్కుంటున్న విషయం తెలిసిందే.

అలా కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత పాత్రలతో ఆకట్టుకోవాలని చూస్తున్న వారిలో నేను కూడా ఒకరు అంటోంది అను ఇమ్మాన్యుయేల్.. ఇన్ని రోజులు సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ దుర్గా పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత టాక్సిక్ రిలేషన్స్ ఉన్న ఈ జనరేషన్లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి అని అటు అభిమానులు కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతలా ప్రతి ఒక్కరికి ఈ పాత్ర కనెక్ట్ అయిపోయింది. ఈ పాత్రతో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మానుయేల్.

ఇదిలా ఉండగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇన్ని రోజులు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంది అనే విషయంపై ప్రస్తావిస్తూ.. "ఈ సినిమా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ జంటగా నటించారు. స్త్రీ దృక్కోణం నుండి ఈ కథ వెలువడింది. అమ్మాయిల గురించి మంచిగా చెప్పే సినిమా ఇది. దీనిని వాస్తవంగా వినిపించేలా నేనే డబ్బింగ్ కూడా చెప్పాను. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చెప్పట్టు కొట్టడం గమనించిన నాకు ఇది చాలా బాగా కనెక్ట్ అయ్యింది.

నా గత చిత్రాల విషయానికి వస్తే.. నేను గడిచిన నా సినిమాల పట్ల ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఒక నటిగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక సంతృప్తి అనేది ఉండాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగచైతన్య, అల్లు అర్జున్, కార్తి, నాని, శివ కార్తికేయన్ లాంటి పెద్ద స్టార్స్ తో నటించాను. కానీ నా కెరియర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే కమర్షియల్ చిత్రాలలో నటించడం వల్ల నటిగా నాకు ఎటువంటి సంతృప్తి లభించలేదు. నాలుగు డాన్స్ స్టెప్పులు వేయించి.. కొన్ని డైలాగులు చెప్పిస్తారు అంతే . ఇక అందుకే ఇకపై కమర్షియల్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను.

ఇప్పుడు కొన్ని కథలు వింటున్నాను. అందులో ఒకటి ఫైనలైజ్ అయింది. త్వరలోనే ఆ విషయాలను ఆ నిర్మాణ సంస్థ మీకు వెల్లడిస్తుంది అంటూ అను చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అనూ ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అను చెప్పింది బట్టి చూస్తే నిజంగానే ఈమెకు కమర్షియల్ చిత్రాలలో నటించడం ఇష్టం లేదా? లేక కమర్షియల్ చిత్రాలలో అవకాశాలు రావడం లేదా? అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు