అంబానీ వంటగదిలో ప్రతిరోజూ 4000 రోటీల తయారీ వెనక అసలు కథ!
అంబానీ కుటుంబం పక్కా శాఖాహార నియమాలను పాటిస్తుంది. ప్రపంచంలోని ఖరీదైన వంటకాలు అందుబాటులో ఉన్నా.. ముకేశ్ అంబానీ మాత్రం పప్పు, అన్నం, రోటీ వంటి సాధారణ భారతీయ భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
By: Sivaji Kontham | 25 April 2026 3:00 PM ISTముకేశ్ అంబానీ నివాసం `యాంటిలియా` అనగానే మనకు ఆకాశాన్నంటే భారీ విలాసం గుర్తుకు వస్తుంది. ఆ భవనం మధ్య అంతస్తులో పార్కింగ్ చేసే విలాసవంతమైన కార్లు, టాప్ లో హెలీ ప్యాడ్, అత్యాధునిక సౌకర్యాల గురించి చాలా చర్చ సాగుతుంది. కానీ అంతటి సంపన్న కుటుంబం ఉండే ఆ ఇంట్లో ప్రతిరోజూ 4000 రోటీలు ఎవరి కోసం సిద్ధమవుతాయో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంబానీల వంటగది నిర్వహణ అత్యంత క్రమశిక్షణతో భారతీయ మూలాలను ప్రతిబింబించేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ అక్కడ దాదాపు 4000 రోటీలు తయారవుతాయనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో రోటీలు వండటానికి కారణం విలాసం కంటే కూడా బాధ్యత, పనివారి ఆకలి విషయంలో ఆలోచనాత్మక ప్రణాళిక ఎంతో గొప్పవి అని చెప్పవచ్చు.
యాంటిలియాలో తయారయ్యే ఈ వేలాది రోటీలు కేవలం అంబానీ కుటుంబ సభ్యుల కోసమే కాదు. ఆ భారీ భవనంలో పనిచేసే వందలాది మంది సిబ్బంది, భద్రతా సిబ్బంది, నిత్యం వచ్చే అతిథులందరికీ అక్కడే భోజన సౌకర్యం ఉంటుంది. దాదాపు 600 మంది సిబ్బంది పని చేస్తుంటారు. వారిలో డ్రైవర్లు, క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులు, టెక్నీషియన్లు, రోజువారీ అతిథులు, ఇతర అసిస్టెంట్లు ఉంటారు. యాంటిలియా అనేది ఒక చిన్నపాటి వ్యవస్థ వంటిది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇంటి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఇంత భారీ స్థాయిలో వంటలు జరుగుతుంటాయి. ప్రత్యేకమైన వంటశాలలలో షిఫ్టుల వారీగా పనిచేసే నిపుణులైన షెఫ్‌లు ఈ ఆహారాన్ని సిద్ధం చేస్తారు.
అంబానీ కుటుంబం పక్కా శాఖాహార నియమాలను పాటిస్తుంది. ప్రపంచంలోని ఖరీదైన వంటకాలు అందుబాటులో ఉన్నా.. ముకేశ్ అంబానీ మాత్రం పప్పు, అన్నం, రోటీ వంటి సాధారణ భారతీయ భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వంటగదిలో కూడా కేవలం శాఖాహారమే వండుతారు. మతపరమైన పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో జైన - వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంటలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూనే పోషక విలువలు తగ్గకుండా ఆహారాన్ని ప్లాన్ చేస్తారు.
ఇక్కడ వంటల తయారీలో తాజాదనానికి పెద్దపీట వేస్తారు. 4000 రోటీలు అంటే వాటిని ఎప్పుడో ఉదయాన్నే చేసి పెట్టరు. భోజన సమయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజాగా వేడివేడిగా సిద్ధం చేస్తారు. నీతా అంబానీ స్వయంగా ఆహారపు మెనూ, నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని సమాచారం. రుచికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం డైట్ ప్లాన్ అనుసరించి జరుగుతుంది.
మరో అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఇంత భారీ స్థాయిలో ఆహారం తయారవుతున్నా అక్కడ `జీరో వేస్ట్` విధానాన్ని అనుసరిస్తారు. ఆహారం వృథా కాకుండా జాగ్రత్త పడటమే కాకుండా.. ఒకవేళ అదనంగా మిగిలితే దానిని అవసరమున్న వారికి లేదా స్వచ్ఛంద సంస్థలకు దానం చేస్తారు. లగ్జరీ హోటల్ షెఫ్‌లతో సమానంగా జీతాలు తీసుకునే నిపుణులు ఈ వంటశాలలను పర్యవేక్షిస్తుంటారు. అక్కడ చపాతీ వండే చెఫ్ కి నెలకు 1లక్ష జీతం అందుతుందంటే రేంజ్ ను అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి యాంటిలియా వంటగది అనేది కేవలం ఆకలి తీర్చే చోటు మాత్రమే కాదు... అది క్రమశిక్షణ, సేవ, భారతీయ సంప్రదాయాల కలయికగా చెప్పుకోవచ్చు. ఎంత ఎదిగినా అంబానీలు కేవలం పప్పన్నం తినడం కూడా వారి గొప్పతనానికి నిదర్శనం.
