Begin typing your search above and press return to search.

డ్రగ్స్ దృశ్యాలు ఉంటే తెరపై వార్నింగ్ పడాల్సిందే!

ఈ హెచ్చరికలు లేకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఎలాంటి సర్టిఫికేట్ లభించదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

By:  Srikanth Kontham   |   18 Sept 2026 4:00 PM IST
డ్రగ్స్ దృశ్యాలు ఉంటే తెరపై వార్నింగ్ పడాల్సిందే!
X

సినిమాల్లో పొగతాగడం (ధూమపానం), మద్యం సేవించడం వంటి దృశ్యాలు వచ్చినప్పుడు తెరపై హెచ్చరిక ప్రకటనలు ప్రదర్శించడం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో మత్తు పదార్థాలు (డ్రగ్స్) లేదా మాదకద్రవ్యాల వాడకం, విక్రయం లేదా రవాణాకు సంబంధించిన దృశ్యాలు చూపించినప్పుడు ఖచ్చితంగా యాంటీ డ్రగ్ హెచ్చరిక లు ప్రదర్శించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలు లేకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఎలాంటి సర్టిఫికేట్ లభించదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. సినిమాల్లో మత్తు పదార్థాల వాడకం లేదా క్రయవిక్రయాల దృశ్యాలు ప్రదర్శితమవుతున్న సమయంలో అక్రమ మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ఖచ్చితంగా జైలు శిక్షకు దారితీస్తాయి. డ్రగ్స్‌కు నో చెప్పండి అనే హెచ్చరిక ప్రకటనను తెరపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. సినిమా ప్రారంభంలో లేదా సదరు దృశ్యాలు వచ్చేటప్పుడు ఈ సందేశం కనిపించడం నిర్బంధం చేశారు.

సినీ రంగానికి సంబంధించి గతంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం.. డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేలా లేదా గ్లోరిఫై చేసేలా దృశ్యాలు ఉండకూడదని సిబిఎఫ్‌సి బోర్డు పర్యవేక్షించేది. అయితే ధూమపానం, మద్యపానం దృశ్యాల మాదిరిగా డ్రగ్స్ దృశ్యాలకు ప్రత్యేకంగా ఎలాంటి ఆన్-స్క్రీన్ హెచ్చరిక ల‌ నిబంధన లేదు. తాజాగా కేంద్రం సినిమాటోగ్రాఫ్ చట్టం కింద సెప్టెంబర్ 16న ఈ కొత్త నిబంధనలను నోటిఫై చేస్తూ డ్రగ్స్ దృశ్యాలకు కూడా స్క్రీన్‌పై చట్టబద్ధమైన హెచ్చరిక ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది.

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు , ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్లకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది. ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లలో మత్తుపదార్థాల సేకరణ లేదా వాడకం దృశ్యాలు ఉన్నప్పుడు కూడా యాంటీ డ్రగ్ హెచ్చరికను ప్రస్ఫుటంగా ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమాజంలో ముఖ్యంగా యువతలో డ్రగ్స్ పట్ల అవగాహన పెంచడానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం 2023 కింద గతేడాది లోనే కేంద్ర ప్రభుత్వం వయస్సు ప్రాతిపదికన తల్లిదండ్రుల మార్గదర్శకత్వ కేటగిరీలను (U/A 7+, U/A 13+, U/A 16+) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా హింస, నేర విధానాలు, అసాంఘిక కార్యకలాపాలు , లైంగిక అంశాల ప్రదర్శనపై నిబంధనలను మరింత కఠినతరం చేశారు. తాజాగా వాటికి అదనంగా డ్రగ్స్ హెచ్చరికల నిబంధన కూడా తోడవ్వడంతో నిర్మాతలు సెన్సార్ సర్టిఫికేషన్ పొందేందుకు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.