'అంతా రాములు చూసుకుంటారు'.. ఇదేమైనా దేవుడి సినిమానా?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం `అంతా రాములు చూసుకుంటారు`.
By: Sivaji Kontham | 7 Sept 2026 8:00 PM ISTయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం `అంతా రాములు చూసుకుంటారు`. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పాటిబండ్ల సూర్యప్రతాప్, కథానాయకుడు సంగీత్ శోభన్, కథానాయిక అనస్వర రాజన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరి, సంగీత దర్శకుడు సంతోష్ రాబన్ , కెమెరామెన్ మహేష్ పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఈ ఈవెంట్‌లో విలేకరులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సరదాగా సమాధానాలిచ్చింది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి `అంతా రాములు చూసుకుంటారు` అనే క్యాచీ టైటిల్ పెట్టడం.. అందులో శ్రీరాముడి ప్రస్తావన ఉండటంతో ఈ సినిమాకి ఏమైనా పౌరాణిక లేదా భక్తి అంశాలతో (మైథాలజీ) సంబంధం ఉందా అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి దర్శకుడు సూర్యప్రతాప్ స్పందిస్తూ.. ఈ సినిమాలో రామాయణం, రాముడి గుడి లేదా ప్రత్యేకంగా ఎలాంటి పౌరాణిక పాత్రలు ఉండవని స్పష్టం చేశారు. ఈ టైటిల్ పెట్టడం వెనుక మానవ నైజం (హ్యూమన్ సైకాలజీ) దాగి ఉందని ఆయన వివరించారు.
సాధారణంగా మనుషులు ఏ పనినైనా 99 శాతం కష్టపడి పూర్తి చేసిన తర్వాత ఆ చివరి 1 శాతం ఫలితం కోసం ``మిగతాది దేవుడే చూసుకుంటాడు`` అని భారం వేస్తుంటారు. మన దైనందిన జీవితంలో నిత్యం వాడే ఈ మానసిక సూత్రం ఆధారంగానే `అంతా రాములు చూసుకుంటారు` అనే ఆలోచన పుట్టిందని దర్శకుడు తెలిపారు. ఇది కేవలం పక్కా గోదావరి నేపథ్యంలో సాగే ఒక ఇన్నోసెంట్- ఫీల్-గుడ్ లవ్ స్టోరీ అని.. సంపూర్ణంగా హ్యూమన్ ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కుతోందని వెల్లడించారు.
ఇక కథానాయకుడు సంగీత్ శోభన్ తన పాత్ర స్వభావాన్ని వివరిస్తూ టైటిల్ అంతరార్ధాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. సాధారణంగా జనాలు 1 శాతం దేవుడి మీద భారమేస్తే... ఈ సినిమాలో తను పోషించే మారుతి' అనే పాత్ర మాత్రం 100 శాతం ``అంతా రాముడే చూసుకుంటాడు`` అని గుడ్డిగా నమ్మి బతికేస్తుంటుందని తెలిపారు. ఆంజనేయ స్వామికి మరో పేరైన మారుతి అనే పేరున్న కుర్రాడు తన జీవితంలో ప్రతిదానికీ రాముడిపైనే నమ్మకం ఉంచడం అనే కాన్సెప్ట్ వెనుక చాలా వినోదాత్మక కోణం ఉందని పేర్కొన్నారు.
మొత్తానికి ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎలాంటి మైథలాజికల్ ఫాంటసీ కథలతో సంబంధం లేకుండా.. కేవలం మన దైనందిన జీవితంలో దేవుడిపై ఉంచే నమ్మకాన్ని వినోదాత్మకంగా మలచడానికే ఈ టైటిల్... కథానాయకుడి పాత్రను డిజైన్ చేశారని స్పష్టమవుతోంది. రాజమండ్రి, గోదావరి అందాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
