Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని కుటుంబం... ANR కోరుకున్నది ఇదే!

By:  Sivaji Kontham   |   21 Sept 2026 9:26 AM IST
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని కుటుంబం... ANR కోరుకున్నది ఇదే!
X

అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనువిందు చేసింది. లెజెండరీ నటుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ముఖ్యంగా ఆయ‌న చివ‌రి రోజుల‌లో ప్ర‌ద‌ర్శించ‌న ధైర్యాన్ని తెలుగు మీడియా మ‌ర్చిపోలేదు. తనకు క్యాన్సర్ సోకిందని... త్వరలోనే ఇహలోకాన్ని వీడతానని మీడియాను స్వయంగా పిలిచి మరీ ఎంతో ధైర్యంగా చెప్పిన గొప్ప మనస్తత్వం ఏఎన్నార్‌ది. ఆయన చూపిన ఆ అసాధారణమైన ధైర్యం, ప్రాక్టికాలిటీ ఇత‌రుల‌లో చూడలేము. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ శిలాఫలకాలపై ఆయన రాయించిన నిత్య సత్యాలు ఎప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉంటాయి.

తన జీవిత కాలంలోనే కాక‌.. తను లేకపోయినా తన కుటుంబం అంతా ఒకే తాటిపై, ఎలాంటి విభేదాలు లేకుండా ఎంతో ఆనందంగా, ఐకమత్యంగా ఉండాలని దివంగత ఏఎన్నార్ ఎంతో బలంగా కోరుకున్నారు. ఆయన కోరుకున్న ఆ కల ఇప్పడు నిజమవుతోంది. అక్కినేని కుటుంబం ఆయన ఆశయాలను తూ.చా తప్పకుండా ఆచరిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్పెషల్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ చూస్తే ఎవరైనా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. అక్కినేని వెంకట్, నాగార్జున సోదరులు ఇద్దరు అలాగే ఏఎన్నార్ కుమార్తెలు .. వారి కుటుంబ సభ్యులతో కూడిన పూర్తి వంశవృక్షం ఈ ఫొటోలో కనువిందు చేస్తోంది.

ఈ అందమైన ఫొటోను షేర్ చేస్తూ యువ నటుడు అఖిల్ అక్కినేని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన తాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (X) వేదికగా షేర్ చేసారు. ఈ ఫొటోలో నాగార్జున, అమల, సుమంత్, నాగచైతన్య, శోభిత, అఖిల్, సుప్రియ తదితరులంతా ఒకే చోట ఎంతో సంతోషంగా కనిపించారు. అక్కినేని ఫ్యామిలీని ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు అమితానందం వ్యక్తం చేస్తూ `ANRLivesOn` అంటూ సోషల్ మీడియాలో స్లోగ‌న్ వినిపిస్తున్నారు.

మరోవైపు అక్కినేని కుటుంబంలోని హీరోలంతా కలిసి మరోసారి `మనం` చిత్రంలాంటి అద్భుతమైన మల్టీస్టారర్ లేదా `మనం` సీక్వెల్‌లో ఎప్పుడు నటిస్తారనే దానిపై అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రతి ఒక్క హీరో ప్రస్తుతం తమ సొంత ప్రాజెక్టులతో.. వేర్వేరు కథలతో బిజీగా ఉండటం... అలాగే మూడు తరాల నటులను ఒకే కథలోకి తీసుకువచ్చి `మనం` స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేయడం అంత తేలిక కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏదేమైనా... ఏఎన్నార్ ఆశించినట్లుగా కుటుంబం అంతా ఒకే కుటుంబంగా కలిసికట్టుగా ఉంటూ ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం అక్కినేని అభిమానులకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. తెలుగు తెరపై నటనకు నిలువెత్తు రూపమైన ANR ఆశయాలు, ఆయన నేర్పిన విలువలు ఎప్పటికీ అక్కినేని కుటుంబంతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కుటుంబ వేడుక టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.