వయసు 43.. ప్రపంచంలోనే అత్యంత అందమైన నటి ఈమె!
అందం అంటే కేవలం యవ్వనంలో ఉండే మెరుపు మాత్రమే కాదు... వయసుతో పాటు వచ్చే పరిణతి అని నిరూపిస్తోంది హాలీవుడ్ స్టార్ నటి అన్నే హాత్వే.
By: Sivaji Kontham | 12 May 2026 7:00 AM ISTఅందం అంటే కేవలం యవ్వనంలో ఉండే మెరుపు మాత్రమే కాదు... వయసుతో పాటు వచ్చే పరిణతి అని నిరూపిస్తోంది హాలీవుడ్ స్టార్ నటి అన్నే హాత్వే. 40 ప్లస్ వయసులోనూ తన అద్భుతమైన రూపంతో అంతకు మించిన నటనతో ప్రేక్షకులను కవ్విస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక `పీపుల్` మ్యాగజైన్ తమ 2026 మే నెల కవర్ పేజీ ఎడిషన్‌లో అన్నే హాత్వేను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ప్రకటించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. 43 ఏళ్ల వయసులో అన్నే చూపిస్తున్న ఫిట్‌నెస్, గ్లామర్ చూసి సినీ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
ఇటీవల విడుదలైన ఫ్యాషన్ ఫిల్మ్ `ది డెవిల్ వేర్స్ ప్రాడా 2`లో అన్నా పోషించిన `ఆండీ` పాత్రకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. కేవలం అందగత్తెగానే కాకుండా.. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా అన్నే హాత్వే గుర్తింపు పొందింది. ఆమె నటించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6.8 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం తనకు ఉన్న స్టార్‌డమ్‌కు నిదర్శనం. అకాడమీ అవార్డు (ఆస్కార్), గోల్డెన్ గ్లోబ్, ప్రైమ్ టైమ్ ఎమ్మీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
న్యూయార్క్ నగరంలో జన్మించిన అన్నే హాత్వే నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఐరిష్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ వంశాలకు చెందిన ఈ నటి ఒక న్యాయవాది, మాజీ నటి దంపతులకు జన్మించింది. విశేషమేమిటంటే గొప్ప ఆంగ్ల కవి విలియం షేక్‌స్పియర్ భార్య పేరు మీదుగానే `అన్నే` అని పేరు పెట్టారు. కళాకారుల కుటుంబం నుండి వచ్చిన ఈ బ్యూటీ చిన్నతనం నుండే నటనపై మక్కువ పెంచుకుని నేడు ప్రపంచ స్థాయి నటిగా ఎదిగింది. తన అందంతోనే కాకుండా మేధస్సుతోనూ అన్నే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అన్నే హాత్వే 2012లో నటుడు-వ్యాపారవేత్త ఆడమ్ షుల్‌మన్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం సాంప్రదాయ యూదు పద్ధతిలో అత్యంత వైభవంగా జరిగింది. వీరికి జోనాథన్, జాక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబానికి, పిల్లల పెంపకానికి ఆమె అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక అందమైన విల్లాతో పాటు న్యూయార్క్‌లో విలాసవంతమైన పెెంట్‌హౌస్‌ను కలిగి ఉన్న ఈ జంట హాలీవుడ్‌లో ఒక ఆదర్శవంతమైన జంటగా పేరు తెచ్చుకుంది.
వయసు పెరిగే కొద్దీ నటీమణుల క్రేజ్ తగ్గుతుందనే పాత చింతకాయ.. సిద్ధాంతాలను అన్నే హాత్వే పటాపంచలు చేస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా నిలవడం వెనుక తన క్రమశిక్షణ, జీవనశైలి దాగి ఉన్నాయి. భారతీయులు లేదా పాకిస్థానీలు కాని ఈ విదేశీ వనిత, తన గ్లోబల్ అప్పీల్‌తో ఖండాతరాలను దాటి అందరినీ ఆకట్టుకుంటోంది. నటిగా, తల్లిగా, ఒక గ్లోబల్ ఐకాన్‌గా అన్నే హాత్వే ప్రయాణం నేటి తరం యువతులకు ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పడంలో సందేహం లేదు.
