ఎప్పుడూ అవే రోల్స్.. 25 ఏళ్ల తర్వాత అన్నపూర్ణమ్మకు 'కొత్త' ఛాన్స్!
టాలీవుడ్ లో 40 ఏళ్లకుగా అలరిస్తున్న సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పేరు వినగానే తల్లి, అత్త, బామ్మ పాత్రలే గుర్తుకు వస్తాయి.
By: M Prashanth | 29 Jun 2026 5:02 PM ISTటాలీవుడ్ లో 40 ఏళ్లకుగా అలరిస్తున్న సీనియర్ నటి అన్నపూర్ణమ్మ పేరు వినగానే తల్లి, అత్త, బామ్మ పాత్రలే గుర్తుకు వస్తాయి. ఎన్నో సినిమాల్లో కుటుంబానికి అండగా నిలిచే మహిళగా, కన్నీరు పెట్టుకునే తల్లిగా, త్యాగమే జీవితంగా భావించే పాత్రల్లో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి అన్నపూర్ణమ్మ ఇప్పుడు తన కెరీర్ లో ఎదురుచూసిన ఛాన్స్ దక్కిందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అన్నపూర్ణమ్మ కీలక పాత్రలో తెరకెక్కుతున్న హ్యాపీ జర్నీ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. "పాతికేళ్ల తర్వాత నాకు నిజంగా నచ్చిన పాత్ర దొరికింది" అంటూ చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. నటిగా ఎన్నో వందల సినిమాలు చేసినా, తనకు నచ్చిన పాత్ర కోసం ఇంతకాలం ఎదురుచూడాల్సి వచ్చిందని ఆమె మాటల్లో అర్థమైంది.
అన్నపూర్ణమ్మ కెరీర్ చూస్తే, హీరోయిన్ గా ప్రారంభమైన జర్నీ తర్వాత సైడ్ రోల్స్ వైపు మళ్లింది. మెల్లగా ఆమెకు ఎక్కువగా తల్లి, అత్త, అమ్మమ్మ పాత్రలే వచ్చాయి. ముఖ్యంగా ఎమోషన్స్ కు పెద్దపీట వేసే, కన్నీరు పెట్టించే, ఫ్యామిలీ కోసం త్యాగం చేసే మహిళ పాత్రల్లో ఆమెనే దర్శకులు ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఆ పాత్రల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినా, నటిగా తనలోని మరో యాంగిల్ ను చూపించే ఛాన్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చినట్లు ఆమె కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది.
ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ చెప్పిన ఓ సంఘటన ఆసక్తికరంగా మారింది. దాదాపు 25 ఏళ్ల క్రితం మురారి సమయంలో ప్రముఖ నటి సుకుమారి తనతో మాట్లాడారని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను చేస్తున్న సినిమాల గురించి అడిగిన తర్వాత, "తెలుగులో నీకు ఎందుకు ఒకేలాంటి పాత్రలే ఇస్తున్నారు? మా మలయాళంలో రకరకాల పాత్రలు ఇస్తారు" అని సుకుమారి చెప్పినట్లు తెలిపారు.
అప్పుడు తాను "నాకు ఇచ్చే పాత్రలు అవే. ఏడ్చే పాత్రలు, త్యాగం చేసే పాత్రలు వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నా" అని చెప్పానని అన్నపూర్ణమ్మ వివరించారు. ఇప్పుడు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ నాయుడు తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఒకే తరహా చీరకట్టు, పెద్ద బొట్టు, ట్రెడిషనల్ లుక్ లో కనిపించే తనను సినిమాలో భిన్నంగా చూపించారని చెప్పారు.
కొత్త కాస్ట్యూమ్స్, కొత్త ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని అన్నపూర్ణమ్మను చూస్తారని తెలిపారు. నిజానికి నటీనటులకు ఒకే తరహా పాత్రలు రావడం తెలుగులో కొత్త విషయం కాదు. ఒక పాత్రలో విజయం సాధిస్తే, అదే తరహా రోల్స్ లో వరుస అవకాశాలు రావడం సహజమే. అయితే అలాంటి పరిస్థితుల్లో నటుడిలోని కొత్తదనం కనిపించకుండా పోతుంది. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించిన ఆమెకు, ఇన్నేళ్ల తర్వాత తనకు నచ్చిన పాత్ర దొరకడం విశేషం. హ్యాపీ జర్నీ కేవలం సినిమా మాత్రమే కాకుండా, అన్నపూర్ణమ్మ కెరీర్ లో కొత్త ఛాప్టర్ గా నిలుస్తుందా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా ఎక్కువై కన్నీరు పెట్టించే పాత్రల్లో చూసిన ప్రేక్షకులు, ఈసారి కొత్త యాంగిల్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.
