లైనప్ పెంచిన అన్నపూర్ణ.. రిలీజ్ బాధ్యతలో ఇలా..
తమ బ్యానర్ సినిమాలకే పరిమితం కాకుండా, ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే పని మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ నెట్‌వర్క్ పెంచుకుంటూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
By: M Prashanth | 4 Sept 2026 3:05 PM ISTఅన్నపూర్ణ స్టూడియోస్ అంటే ముందుగా గుర్తొచ్చేది స్టూడియో, ప్రొడక్షన్. కానీ ఈమధ్య వాళ్లు డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా బాగా ఫోకస్ పెడుతున్నారు. తమ బ్యానర్ సినిమాలకే పరిమితం కాకుండా, ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే పని మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ నెట్‌వర్క్ పెంచుకుంటూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే మలయాళం నుంచి ఈకో, బాలన్: ది బాయ్ సినిమాలను తీసుకొచ్చారు. సూర్య నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ను తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజ్ చేశారు. అఖిల్ ‘లెనిన్’ కూడా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌లోనే వచ్చింది. ఒక్క అక్కినేని సినిమాలతోనే కాకుండా, బయట నుంచి వచ్చిన కంటెంట్‌ను కూడా తెలుగు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే రూట్‌లో వెళ్తున్నారు.
సెప్టెంబర్‌లో ఈ స్పీడ్ ఇంకాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కార్తి ‘సర్దార్ 2’, ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సినిమాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ‘రంభ ఊర్వశి మేనక’ కూడా ఈ సంస్థ నుంచి వస్తున్నదే. ఆ సినిమాకు ప్రొడక్షన్‌లో భాగంగా ఉండటంతో పాటు రిలీజ్ బాధ్యత కూడా అన్నపూర్ణదే.
ఈ లైనప్ గురించి అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారని, కంటెంట్ కనెక్ట్ అయితే భాష అడ్డంకి కాదని చెప్పారు. తాము నమ్మిన సినిమాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావాలన్నదే తమ డిస్ట్రిబ్యూషన్ ఆలోచన అని తెలిపారు.
ఇక్కడ కమిషన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్‌ను మళ్లీ తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత దగ్గర నుంచి ఏరియా రైట్స్ పూర్తిగా కొనేసే బదులు, సినిమా రిలీజ్ చేసి వచ్చిన వసూళ్లలో నిర్ణయించిన కమిషన్ తీసుకునే పద్ధతి ఇది. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు థియేటర్లలో మరిన్ని అవకాశాలు దొరకాలన్నది అన్నపూర్ణ చెబుతున్న లెక్క. నిర్మాతలకు కూడా రిలీజ్ దగ్గర మరో రూట్ దొరుకుతుంది.
ఒకప్పుడు అన్నపూర్ణ పేరు అనగానే సినిమాలు తీసే స్టూడియోనే ముందుగా గుర్తొచ్చేది. తర్వాత ప్రొడక్షన్‌లో కూడా వరుస సినిమాలు వచ్చాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఒక్కో సినిమా చొప్పున లైనప్ పెరుగుతోంది. సెప్టెంబర్‌లోనే నాలుగు సినిమాలు చేతిలో ఉండటంతో ఈ విభాగంపై వాళ్లు ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఇక రాబోయే నెలల్లో బయట బ్యానర్ల నుంచి ఇంకెన్ని సినిమాలు అన్నపూర్ణ చేతికి వస్తాయన్నది చూడాలి.
