Begin typing your search above and press return to search.

ఫిలిం స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ రెన్యువ‌ల్ చేయ‌క‌పోతే?

టాలీవుడ్ కి ద‌శాబ్ధాలుగా సేవ‌లందిస్తున్న పాపుల‌ర్ ఫిలింస్టూడియోస్ ఊహించ‌ని కార‌ణంతో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి.

By:  Sivaji Kontham   |   21 Nov 2025 12:27 PM IST
ఫిలిం స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ రెన్యువ‌ల్ చేయ‌క‌పోతే?
X

టాలీవుడ్ కి ద‌శాబ్ధాలుగా సేవ‌లందిస్తున్న పాపుల‌ర్ ఫిలింస్టూడియోస్ ఊహించ‌ని కార‌ణంతో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్‌ఎంసీ) నోటీసులు జారీ చేసింది. పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్‌ ఫీజును తప్పనిసరిగా చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

న‌గ‌రంలో ఏ వ్యాపారం చేయాల‌న్నా షాపులు లేదా ఇత‌ర సంస్థ‌లు విధిగా ట్రేడ్ లైసెన్స్ ను ప్ర‌తి యేటా రెన్యువ‌ల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప‌న్ను చెల్లింపుల‌తో పాటు విధిగా ట్రేడ్ డాక్యుమెంట్ ని అధికారులు తణిఖీలు చేస్తుంటారు. అయితే రామానాయుడు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ‌లు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇక ఈ రెండు పెద్ద ఫిలింస్టూడియోలు ద‌శాబ్ధాల‌ చ‌రిత్ర‌ను క‌లిగి ఉన్నాయి. నాటి మ‌ద్రాసు నుంచి సినీప‌రిశ్ర‌మ‌ను హైద‌రాబాద్ కి త‌ర‌లించ‌డంలో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టూడియోలు ఇవి. సార‌థి స్టూడియోస్, శ‌బ్ధాల‌యా స్టూడియోస్, ప‌ద్మాల‌యా స్టూడియోస్, రామ‌కృష్ణ స్టూడియోస్ వంటి పాపుల‌ర్ స్టూడియోలు ఎన్ని ఉన్నా, ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘ కాలం సేవ‌లందించిన అధునాత‌న ఫిలింస్టూడియోస్ గా రామానాయుడు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోస్ మాత్ర‌మే మ‌న‌సుల‌ను గెలుచుకున్నాయి. ఇప్ప‌టికీ ఈ రెండు ఫిలింస్టూడియోస్ ఎంతో యాక్టివ్ గా సేవ‌లందిస్తున్నాయి. ఫిలింమేకింగ్ స్ట‌డీస్ లో రామానాయుడు ఫిలింస్కూల్, అన్న‌పూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా స్ట‌డీస్ సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్నాయి.

సుమారు 108 ఏళ్ల‌ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ద‌శాబ్ధాల పాటు మ‌నుగ‌డ సాగించిన ఫిలిం స్టూడియోస్ మ‌న‌కు ఉన్నాయి. బాలీవుడ్ లో ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థానం ప్రారంభించి 50 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ... సార‌థి స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇప్ప‌టికే 50 వ‌సంతాలు పూర్తి చేసుకున్నాయి.

13 ఆగస్ట్ 1975 లో తెలుగు సినిమాకు పునాది రాయిగా నిలిచిన అన్న‌పూర్ణ స్టూడియోస్ కి శంకుస్థాపన చేయ‌గా, దివంగ‌త నిర్మాత మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు -డి.సురేష్ బాబు సార‌థ్యంలోని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ దాదాపు 50 సంవ‌త్స‌రాలుగా సినీప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందిస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కి అనుబంధంగా రామానాయుడు ఫిలింస్టూడియోస్ 2008 నుంచి అత్యంత భారీగా విస్త‌రించింది.