పుట్టింటిని తలచి తలచి ఎమోషనల్ అయిన అన్నా కొణిదెల!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఎమోనల్ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది.
By: Sivaji Kontham | 24 May 2026 4:35 PM ISTఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఎమోనల్ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది. రష్యాలోని పాపులర్ నగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుట్టి పెరిగిన అన్నా భారతదేశానికి కోడలిగా వచ్చిన తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న సాంస్కృతిక మార్పులను, తన మాతృభూమితో ఉన్న విడదీయరాని మమకారాన్ని ఎంతో హృద్యంగా కవితాత్మకంగా అక్షరబద్ధం చేశారు.
నిరంతరం సూర్యకాంతి, వేడి, రంగులు, కోలాహలంతో నిండి ఉండే భారతదేశంలో జీవిస్తున్నా కానీ తన స్వస్థలంపై ఉండే హోమ్‌సిక్‌నెస్ (ఇంటిపై బెంగ)కు ఎలాంటి తార్కిక కారణాలు ఉండవని అన్నా లెజినోవా పేర్కొన్నారు. తాను ఒక ఉత్తరాది బిడ్డనని చెప్పుకుంటూ.. వర్షం, చల్లటి గాలి, పాత మ్యూజిక్ హాళ్లు, పూర్తిగా చీకటి పడని వైట్ నైట్స్ ఉండే నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ అని గుర్తుచేసుకున్నారు. అక్కడ గడిపిన సుదీర్ఘ శీతాకాలాలు.. శాస్త్రీయ సంగీతం, పుస్తకాలు, నిశ్శబ్దం, మ్యూజియమ్‌లు, థియేటర్లు .. ఆ వాతావరణంలో ఉండే ఒక విధమైన నిగూఢ నిశ్శబ్ద వేదన తన ఆత్మలో శాశ్వతంగా భాగమైపోయాయని అన్నా రాసారు. గడ్డకట్టే చలి సాయంత్రాల్లో మంచుపై నడిచినప్పుడు వచ్చే శబ్దం.. థియేటర్లలో షోకు సిద్ధమవుతున్న ఆర్కెస్ట్రా ధ్వనులు ఇప్పటికీ తనలో సజీవంగా ఉన్నాయని అన్నా కొణిదెల భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే జీవితం తనను భారతదేశానికి తీసుకువచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణం.. సుగంధ ద్రవ్యాల సువాసనలు.. జీవితంతో ఉరకలేసే వీధులు.. ప్రతి అనుభూతిని ఓపెన్‌గా, ఘాఢతతో తెలియజేసే మనుషులు తనను పూర్తిగా మార్చేశారని అన్నా చెప్పుకొచ్చారు. ఈ దేశం తనకు ప్రేమను, కుటుంబాన్ని, అద్భుతమైన జ్ఞాపకాలను అందించి మరొక ఇల్లుగా మారిందని కొనియాడారు. అయితే దశాబ్దాల పాటు విదేశాలలో నివసించినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందని... మనిషి ఒకేసారి రెండు ప్రాంతాలకు చెందినవాడిగా ఉంటూనే.. కాలక్రమేణా ఆ రెండు ప్రాంతాలకు పూర్తిగా చెందకుండా మిగిలిపోతాడనే నిజాన్ని అన్నా లెజినోవా ఎంతో తాత్వికంగా చిత్రీకరించారు.
ఈ పోస్టుతో పాటు అన్నా కొణిదెల సాంప్రదాయ నీలం రంగు చీర కట్టుకుని దిగిన ఫోటోలను షేర్ చేయగా అభిమానులు.. నెటిజన్లు తన లుక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ హాట్ సమ్మర్‌లో మిమ్మల్ని ట్రెడిషనల్ లుక్‌లో చూడటం ఎంతో రిఫ్రెషింగ్‌గా, కూల్‌గా ఉంది వదినమ్మ! అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు తనను ఆకాశంలో ఉదయించే చంద్రుడితో.. దేవతతో పోల్చారు. విభిన్న సంస్కృతులను గౌరవిస్తూ భారతీయ సంప్రదాయాన్ని అన్నా ఎంతో హుందాగా స్వీకరించిన తీరును నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
మరికొందరు మహిళలు ఈ పోస్ట్‌కు కనెక్ట్ అవుతూ... పెళ్లయిన తర్వాత ప్రతి అమ్మాయి ఒక ఇల్లు వదిలి మరో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇలాంటి భావోద్వేగాలనే అనుభవిస్తుందని... పుట్టినిల్లు- మెట్టినిల్లు రెండింటినీ సమానంగా ప్రేమించడం అమ్మాయిలకే సాధ్యమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలు తగ్గినా సెయింట్ పీటర్స్‌బర్గ్ నగర ప్రేమికురాలిగా.. నిశ్శబ్దాన్ని కోరుకునే వ్యక్తిగా తనలోనే నిశ్శబ్దంగా బ్రతికే ఉంటుందని అన్నా కొణిదెల తన హృదయంతో రాసిన కవితను ముగించారు.
