Begin typing your search above and press return to search.

'బ్యూటీ' సినిమా ఎలా ఉంటుందంటే..: హీరో అంకిత్

సినిమాకు అసలైన ‘బ్యూటీ’ ఏమిటో చెప్పమని అడిగితే, వెంటనే నరేష్ గారి పాత్రనే అని అంకిత్ పేర్కొన్నారు. “నరేష్ గారు ఈ చిత్రానికి బలం.

By:  M Prashanth   |   18 Sept 2025 7:08 PM IST
బ్యూటీ సినిమా ఎలా ఉంటుందంటే..: హీరో అంకిత్
X

టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యూటీ’ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీలఖి హీరోయిన్‌గా నటిస్తుండగా, వీకే నరేష్, వాసుకి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించగా, ఆర్.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా హీరో అంకిత్ కొయ్య మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

అంకిత్ మాట్లాడుతూ, ఈ కథలోకి తన ఎంట్రీ ఎలా జరిగిందో వివరించారు. ‘బ్యూటీ’ టైటిల్‌ను, లోగోను మారుతి గారు డిజైన్ చేశారు. అన్నీ ఫిక్స్ అయ్యాకే నేను ఈ సినిమా ప్రాజెక్ట్‌లో చేరాను. కథ విన్న తర్వాత నిజంగానే షాక్ అయ్యాను. నాకు చాలా నచ్చింది. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారో అనేది కాస్త భయం కలిగించింది అన్నారు. తాను ఇప్పటివరకు చేయని కొత్త రకం పాత్రను ఈ సినిమాలో పోషించానని తెలిపారు. “అర్జున్ పాత్రలో నేను కనిపిస్తాను. ఆడియన్స్ ఎలా అంగీకరిస్తారో అని మొదట్లో భయపడ్డాను. కానీ నటుడిగా పాత్రకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఆ బాధ్యతతో చేశాను” అన్నారు.

సినిమాకు అసలైన ‘బ్యూటీ’ ఏమిటో చెప్పమని అడిగితే, వెంటనే నరేష్ గారి పాత్రనే అని అంకిత్ పేర్కొన్నారు. “నరేష్ గారు ఈ చిత్రానికి బలం. ఆయన పోషించిన మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రే ఈ మూవీకి ప్రధాన బలం. ఆ పాత్ర చూసి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నరేష్ గారు, వాసుకి గారి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు” అని చెప్పారు.

అలాగే నీలఖి గురించి మాట్లాడుతూ, “అలేఖ్య పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. కొన్ని సీన్లలో కాస్త ఇబ్బంది అనిపించినా ఆమె సహకారం వల్ల సులభమైంది. పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది” అన్నారు. డైరెక్టర్ వర్ధన్‌తో తన జర్నీ గురించి అంకిత్ విశ్లేషించారు. “కథా చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. ప్రతీ చిన్న విషయాన్ని డీటైలింగ్‌గా మాట్లాడుకున్నాం. వర్ధన్ గారు అద్భుతంగా స్క్రీన్‌ప్లే హ్యాండిల్ చేశారు. ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఇచ్చారు. మాకు ఎంతో నమ్మకాన్ని కలిగించారు” అని చెప్పారు.

ఇక నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గురించి మాట్లాడుతూ, “ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మాకు ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేసేవారు. ప్రొడక్ట్ బాగా రావాలనే ఎప్పుడూ పరితపించేవారు. మాకు అండగా మారుతి గారు, జీ స్టూడియో నిలబడ్డారు. వారి సహకారంతోనే బ్యూటీ ఇంత గొప్పగా వచ్చింది” అన్నారు.

మ్యూజిక్ గురించి మాట్లాడిన అంకిత్, “బ్యూటీ పాటలు అద్భుతంగా వచ్చాయి. కన్నమ్మ పాట ఇంకా ట్రెండ్ అవుతోంది. విజయ్ బుల్గానిన్ చాలా మంచి పాటలు ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆర్ఆర్ అద్భుతంగా పనిచేసింది” అన్నారు.

ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చో అడిగినప్పుడు ఆయన “బ్యూటీ ప్రతీ ఇంట్లో, ప్రతీ వీధిలో జరిగే కథ. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్లను అద్భుతంగా చూపించాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.