Begin typing your search above and press return to search.

మ్యూజిక్ వ‌ర‌ల్డ్‌ని టెన్ష‌న్ పెడుతున్న గ్యాంగ్‌స్ట‌ర్ క‌ల్చ‌ర్.. గాయ‌కుల వ‌ర‌స హ‌త్య‌ల‌తో ద‌డ‌!

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ లేకుండానే గ్యాంగ్ స్ట‌ర్ యాక్టివిటీస్ భార‌త‌దేశంలో పెరుగుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

By:  Sivaji Kontham   |   1 Sept 2026 9:47 AM IST
మ్యూజిక్ వ‌ర‌ల్డ్‌ని టెన్ష‌న్ పెడుతున్న గ్యాంగ్‌స్ట‌ర్ క‌ల్చ‌ర్.. గాయ‌కుల వ‌ర‌స హ‌త్య‌ల‌తో ద‌డ‌!
X

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ లేకుండానే గ్యాంగ్ స్ట‌ర్ యాక్టివిటీస్ భార‌త‌దేశంలో పెరుగుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. కొన్నేళ్ల క్రితం పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయంతో జరిగిన ఆ ఘటనతో గ్యాంగ్‌స్టర్ సంస్కృతి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని.. అది ముంబై నుంచి పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరకు పాకిందని స్పష్టమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా అలాంటి భయానక వాతావరణం నెలకొంది. షామ్లీ పట్టణంలో 32 ఏళ్ల హర్యానవీ సింగర్, యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురికావడం యూపీ, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర అలజడి సృష్టించింది.

జిమ్‌లో వర్కవుట్ ముగించుకుని తన కారు వైపు వెళ్తున్న అంకిత్ బలియాన్‌పై బైకులపై వచ్చిన ముసుగు దొంగలు విచక్షణారహితంగా 18 రౌండ్ల కాల్పులు జరిపారు. తలకు బుల్లెట్లు తగలడంతో అత‌డు అక్కడికక్కడే మరణించారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అంకిత్ తుపాకీ సంస్కృతి - గ్రామీణ నేపథ్యాలతో రూపొందించిన `కోర్ట్ మే గోలీ మారేంగే`, `గోలీ కే బరూద్` వంటి పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన హత్య వార్తతో ఆగ్రహించిన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించగా.. రాజకీయ నాయకులు కూడా శాంతిభద్రతల వైఫల్యంపై నిలదీశారు.

ఈ దారుణ హత్య వెనుక ఢిల్లీకి చెందిన ప్రముఖ `గోగి గ్యాంగ్` హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంకిత్ పాడిన `కోర్ట్ మే గోలీ మారేంగే` అనే పాట 2021లో రోహిణి కోర్టులో జరిగిన గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగి హత్యను పరోక్షంగా హేళన చేసేలా ఉందనే కక్షతోనే ప్రత్యర్థి ముఠా ఈ పగతీర్చుకునే కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో గోగి గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌షూటర్లను మట్టుబెట్టారు.

సిద్ధూ మూసేవాలా, అంకిత్ బలియాన్ లతో పాటు భారతదేశంలో గతంలోనూ పలువురు ప్రముఖ గాయకులు దారుణ హత్యలకు గురయ్యారు. 1997లో టి-సిరీస్ అధినేత, ప్రముఖ భక్తి పాటల గాయకుడు గుల్షన్ కుమార్ ను ముంబైలో అండర్‌వరల్డ్ ముఠా చేతిలో దారుణంగా కాల్చి చంపారు. అలాగే 1988లో పంజాబీ జానపద సంగీతంలో విప్లవం సృష్టించిన ప్రముఖ గాయకుడు అమర్‌సింగ్ చమ్కీలా - ఆయన భార్య అమర్‌జోత్‌లను గుర్తుతెలియని దుండగులు వేదికపైనే కాల్చి చంపారు. ఆ త‌ర్వాత మ‌రో యువ గాయ‌కుడు సిద్ధూ మూసేవాలా హ‌త్యా సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ వరుస ఘటనలు చూస్తుంటే గ్యాంగ్‌స్టర్ సంస్కృతి, వ్యక్తిగత కక్షలు సంగీత రంగాన్ని ఎంతలా శాసిస్తున్నాయో అర్థమవుతోంది. కేవలం పాటలు పాడటం, యూట్యూబ్‌లో క్రేజ్ తెచ్చుకోవడమే నేరమైనట్లుగా మారి గాయకుల ప్రాణాలు గాల్లో కలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సంగీత కళాకారులకు సరైన రక్షణ కల్పిస్తూ... ఇలాంటి గ్యాంగ్‌స్టర్ ముఠాల మూలాలను మట్టుబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.