డ్యాన్స్ రీల్స్ చేస్తే సీతగా నటించకూడదా?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అంజలి అరోరా `మహాకావ్య శ్రీ రామాయణ్ కథ` చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించడంపై వస్తోన్న విమర్శలపై స్పందించారు.
By: Srikanth Kontham | 18 Sept 2026 2:00 PM ISTసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అంజలి అరోరా `మహాకావ్య శ్రీ రామాయణ్ కథ` చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించడంపై వస్తోన్న విమర్శలపై స్పందించారు. నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నంత మాత్రాన తాను ఎంతమాత్రం బాధపడటం లేదని తేల్చి చెప్పారు. చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అంజలి ప్రేక్షకులు తన వ్యక్తిగత జీవితాన్ని .. సోషల్ మీడియా ఇమేజ్‌ను పక్కన పెట్టి కేవలం నటనను మాత్రమే చూడాలని కోరారు.
సీతాదేవి పాత్రలో నటించడం వల్ల ఎదురైన ట్రోల్స్ మిమ్మల్ని బాధించాయా? అని ప్రశ్నించగా అంజలి స్పష్టతతో సమాధానమిచ్చారు. `నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే మేము పబ్లిక్ ఫిగర్స్. మమ్మల్ని జడ్జ్ చేసే హక్కును మేమే ప్రజలకు ఇచ్చాం. కాబట్టి మమ్మల్ని సానుకూలంగా చూస్తారా? లేక ప్రతికూలంగా చూస్తారా? అనేది వారి ఇష్టం. మమ్మల్ని ఇష్టపడే లేదా విమర్శించే పూర్తి హక్కు ప్రేక్షకులకు ఉంది` అని పేర్కొన్నారు.
అంజలి డాన్స్ వీడియోలపై వస్తోన్న కామెంట్లపై కూడా స్పందించారు. `గతంలో డ్యాన్స్ రీల్స్ చేసిన నేను సీతాదేవి పాత్ర ఎలా పోషిస్తానంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అసలు డ్యాన్స్ చేయని నటుడు ఎవరున్నారు? నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. అదొక హాబీ మాత్రమే. దాని గురించి సిగ్గుపడటానికి ఏమీ లేదు` అని ధీమాగా చెప్పారు. నటిగా ఏ పాత్ర లభించినా 100 శాతం అంకితభావంతో నటిస్తానని తెలిపారు.
తెరపై తాను పోషించిన పాత్రకు, బయట ఉండే పర్సనాలిటీకి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని అంజలి విజ్ఞప్తి చేశారు. `ట్రైలర్ చూసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో మీరు చూసే అంజలినే ఇందులో కనిపించిందా? నా ఉద్దేశమల్లా ఒక్కటే.. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని, సోషల్ మీడియా ఇమేజ్‌ను పక్కన పెట్టి కేవలం నటిగా చూడాలని కోరుకుంటున్నాను` అని వెల్లడించారు.
రామాయణం ఆధారంగా అభిషేక్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రమిది. ఇందులో శ్రీరాముడిగా దేవ్ శర్మ, సీతగా అంజలి అరోరా నటించారు. రావణుడిగా రజనీష్ దుగ్గల్, లక్ష్మణుడిగా శీల్ వర్మ, హనుమంతుడిగా నిర్భయ్ వాధ్వా కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ మహోబియా, సంజయ్ బుందేలా కలసి మహోబియా ఫిల్మ్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. ఈ పౌరాణిక చిత్రం హిందీతో పాటు ఛత్తీస్‌గఢీ భాషలో సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
