వయసు ఒక నంబర్ మాత్రమే: 63 ఏళ్ల వయసులో నటి అడ్వెంచర్స్!
వయసు పెరిగేకొద్దీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ అలనాటి బాలీవుడ్ నటి అనితారాజ్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం.
By: Sivaji Kontham | 15 April 2026 5:00 AM ISTవయసు పెరిగేకొద్దీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ అలనాటి బాలీవుడ్ నటి అనితారాజ్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ప్రస్తుతం 63 ఏళ్ల వయసులో ఉన్న ఈ వెటరన్ నటి జిమ్‌లో యువతకు సవాల్ విసిరేలా కఠినమైన వ్యాయామాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే! అని నిరూపిస్తూ జిమ్ లో హార్డ్ వర్క్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
1981లో `ప్రేమ్ గీత్` చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమైన అనితారాజ్ సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి మేటి నటుడు జగదీష్ రాజ్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనితారాజ్ ధర్మేంద్ర వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా చోటీ సర్దార్నీ, యే రిష్తా క్యా కెహ్లాతా హై వంటి పాపులర్ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా అనిత దగ్గరయ్యారు. నటిగా ఎంతో బిజీగా ఉన్నా కానీ... తన ఆరోగ్యం విషయంలో అనితా చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం.
తన ఫిట్‌నెస్ విషయానికొస్తే... ఈ వయసులో భారీ బరువులు ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), కష్టతరమైన ప్లాంక్స్, పుల్-అప్స్ వంటి వర్కవుట్స్‌ను అనితారాజ్ ఎంతో సునాయాసంగా చేసేస్తున్నారు. ఉదయం లేవగానే కనీసం జాగింగ్ చేయడానికి కూడా బద్ధకించే నేటి తరం యువతకు ఈ ఏజ్ లెస్ నటి ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. సరైన పోషకాహారం తీసుకోవడమే తన ఫిట్‌నెస్ రహస్యమని ఆమె చెబుతుంటారు. `వీకెండ్ వైబ్స్.. వర్కవుట్ హైస్` అంటూ షేర్ చేసే పోస్టులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అనితారాజ్ క్రమశిక్షణ , అంకితభావం చూసిన అభిమానులు తనను `ఫిట్‌నెస్ ఐకాన్`గా కొనియాడుతున్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఇంతటి శక్తిని, ఉత్సాహాన్ని కలిగి ఉండటం వెనుక సంవత్సరాల తరబడి చేసిన కష్టం ఉందని వారు కామెంట్స్ చేస్తున్నారు. వృద్ధాప్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కానీ మనసుకి కాదని.. ఇష్టపడితే ఏ వయసులోనైనా దృఢంగా ఉండవచ్చని నిరూపిస్తున్నారు. అనితా రాజ్ సాహసాలు ఎంతోమందికి ఒక కొత్త ప్రేరణ.
తన వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే అనితారాజ్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం విశేషం. దర్శకుడు సునీల్ హింగోరానీని వివాహం చేసుకున్న ఈ నటికి శివమ్ అనే కుమారుడు ఉన్నాడు. తన కుటుంబ సభ్యులతో పాటు.. మేనకోడళ్లు మాళవిక రాజ్, సోనాక్షి రాజ్‌లకు కూడా తనే ఒక రోల్ మోడల్. లక్ష్యంపై స్పష్టత, చేసే పనిపై పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని అనితారాజ్ తన జీవనశైలి ద్వారా చాటిచెబుతున్నారు.
