బక్కోళ్లు.. ఎవరికి వారే ప్రూవ్ చేసుకుంటారా?
సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే చర్చ కంటే ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
By: M Prashanth | 12 July 2026 8:30 AM ISTసినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే చర్చ కంటే ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లగలదని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా స్టార్ హీరోలతో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు యువ సంగీత దర్శకులు అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యంకర్ గురించి చర్చ జరుగుతోంది.
అంతా బక్కోళ్లు అని ముద్దుగా పిలుచుకుంటుండగా.. అనిరుధ్ ఇప్పటికే సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే బ్యాక్‌గ్రౌం డ్ స్కోర్, వైరల్ అయ్యే పాటలు, వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తన స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఆయన చేతిలో పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా కూడా ఒకటి.
మరోవైపు సాయి అభ్యంకర్ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ప్రైవేట్ ఆల్బమ్ లతో వచ్చిన క్రేజ్ ను సినిమాల్లోకి తీసుకొచ్చి వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కొత్త జెనరేషన్ కు తగ్గ మ్యూజిక్ స్టైల్, ఫ్రెష్ కంపోజిషన్లతో నిర్మాతల నమ్మకాన్ని సంపాదించారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు కూడా అవకాశం రావడం ఆయన ఎదుగుదలకు ఎగ్జాంపుల్ గా మారింది. ఇప్పుడు అనేక సినిమాలకు వర్క్ చేస్తుండగా, అందులో ధనుష్- వెట్రిమారన్ తమిళ మురుగన్ ఒకటి.
ఇప్పుడు ఆ ఇద్దరి కెరీర్ లో ఒకే సమయంలో కీలకమైన పరీక్ష ఎదురుకానుంది. అనిరుధ్ తన స్థాయిని మరోసారి నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో ప్రతి సినిమాతో కొత్తగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. మరోవైపు సాయి అభ్యంకర్ కు మాత్రం ఇది తనను తాను మరింత బలంగా ప్రూవ్ చేసుకునే అవకాశం. పెద్ద హీరోలు, భారీ ప్రాజెక్టులు తనకు ఎందుకు వస్తున్నాయో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ముఖ్యంగా ఇద్దరూ ప్రస్తుతం మైథాలజీ టచ్ ఉన్న భారీ చిత్రాలకు సంగీతం అందించనుండడం ఆసక్తిని పెంచుతోంది. ఇలాంటి కథల్లో సంగీతానికి చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఎమోషన్స్, డివోషనల్, యాక్షన్, విజువల్స్... అన్నింటినీ ఎలివేట్ చేయాల్సిన బాధ్యత మ్యూజిక్ పైనే ఉంటుంది. అందుకే ఆ సినిమాలు ఇద్దరి కెరీర్ లో కూడా స్పెషల్ ఇంపార్టెన్స్ సంపాదించుకున్నాయి.
ఆ చిత్రాలతో ఎవరికి వారే తమ స్థాయిని మరోసారి నిరూపించుకునే అవకాశంగా ఇప్పుడు సినీ ప్రియులు చూస్తున్నారు. ఒకరు ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉన్నారు.. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. మరొకరు వేగంగా క్రేజ్ సంపాదిస్తున్నారు.. తాను కూడా అదే స్థాయికి చేరగలనని చూపించాలి. అందుకే రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్, ఆడియన్స్ రెస్పాన్స్ పై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఆయా సినిమాలతో ఇద్దరు బక్కోళ్లు ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
