Begin typing your search above and press return to search.

ఇంటిమేట్ సీన్ల లీకేజీలకు చెక్ పెట్టేది ఎలా?

సినిమాలు .. వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ సమయంలో నటీనటులు ఇంటిమేట్ సన్నివేశాల భద్రత , గోప్యతపై ఇటీవల మళ్లీ చర్చ మొదలైంది.

By:  Srikanth Kontham   |   7 Oct 2026 12:00 AM IST
ఇంటిమేట్ సీన్ల లీకేజీలకు చెక్ పెట్టేది ఎలా?
X

సినిమాలు .. వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ సమయంలో నటీనటులు ఇంటిమేట్ సన్నివేశాల భద్రత , గోప్యతపై ఇటీవల మళ్లీ చర్చ మొదలైంది. నటి రాధికా ఆప్టే ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంటిమేట్ క్లిప్ లీక్ అయిన సంఘటనను, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఈ అంశంపై ఆమెతో కలిసి `లస్ట్ స్టోరీస్ 3`లో నటించిన నటుడు అనిరుధ్ సూర్య తొలిసారి స్పందించారు. సెట్స్‌పై అనుసరించాల్సిన కఠినమైన భద్రతా నిబంధనలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

`లస్ట్ స్టోరీస్ 3` లో రాధికా ఆప్టేకి ఎదురైన ఆన్-స్క్రీన్ క్లిప్ లీక్ సంఘటనపై అనిరుద్ మాట్లాడుతూ, `అనుమతి లేకుండా ప్రైవేట్ లేదా ఇంటిమేట్ దృశ్యాలు రికార్డ్ కావడం నటీనటులకు తీవ్ర అసౌకర్యాన్ని, మానసిక వేదనను కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సన్నివేశాలు చాలా ప్రైవేట్ అని, వాటిని కావాలని లీక్ చేయడం లేదా అక్రమంగా రికార్డ్ చేయడం ఏమాత్రం సరైనది కాదని పేర్కొన్నారు.

నటీనటుల రక్షణ కోసం సినిమా సెట్స్‌లో తీసుకునే భద్రతా జాగ్రత్తలను వివరించారు. సాధారణంగా సినిమాలలో ఇంటిమేట్ సీన్లు చేసేటప్పుడు నటీనటులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి, సన్నివేశాలను సజావుగా పూర్తి చేయడానికి ఇంటిమసీ కోఆర్డినేటర్లు ఉంటారని చెప్పారు. అయితే లీకేజీలను అరికట్టడానికి మాత్రం నిర్మాణాలు , సాంకేతిక బృందం కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

చిత్రీకరణ సమయంలో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లు , ఒప్పందాలు కీలక పాత్ర పోషిస్తాయని అనిరుధ్ గుర్తుచేశారు. సెట్స్‌లోని ప్రతి ఒక్కరూ చట్టపరమైన ఒప్పందాలకు లోబడి పనిచేస్తారని, అందువల్ల ప్రొడక్షన్ బృందం నుండి అనధికారిక ఫుటేజ్ లీక్ కావడం దాదాపు అసాధ్యమన్నారు. రాధికా ఆప్టే సంఘటనలో సెట్ వెలుపలి వ్యక్తులు లేదా ఎవరైనా ఫోన్‌ ద్వారా సీక్రెట్‌గా రికార్డ్ చేసి ఉండొచ్చ‌ని అంచనా వేశారు.

ఇలాంటి అనధికారిక లీకేజీలను పూర్తిగా అరికట్టడానికి ఏకైక మార్గం సెట్స్‌పై ఫోన్లను నిషేధించడమేనని అనిరుధ్ సూర్య స్పష్టం చేశారు. ఇంటిమేట్ సీన్ల చిత్రీకరణ సమయంలో సెట్‌లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు అనుమ తించకుండా నో-ఫోన్ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఫోన్లు వెంట తీసుకురాకుండా చూసుకుంటేనే నటీనటుల అనుమతి లేకుండా చిత్రించిన ఫుటేజ్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యే ప్రమాదాన్ని అడ్డుకోవచ్చని తెలిపారు.

విక్రమాదిత్య మోట్వానే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో రాధికా ఆప్టేతో తక్కువ సన్నివేశాలే పంచుకు న్నప్పటికీ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఓ కళాకారుడిగా తాను అర్థం చేసుకోగలనని అనిరుధ్ అన్నారు. మహిళా నటీనటులకు సెట్స్‌పై పూర్తి భద్రత , గౌరవం లభించేలా పరిశ్రమలో కఠినమైన నిబంధనలు అమలులోకి రావడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.