Begin typing your search above and press return to search.

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌ను నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 21న చెన్నైలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

By:  M Prashanth   |   11 Nov 2026 10:03 PM IST
అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్
X

సినిమా ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ భారీ స్థాయికి చేరుకున్నారు. మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో సన్ పిక్చర్స్ కూడా పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు ఈ రెండు పేర్ల మధ్య సినిమాలకు మించిన బంధం ఏర్పడింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌ను అనిరుధ్ వివాహం చేసుకున్నారు.





ఇద్దరి వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరిగింది. ఈ సందర్భంగా అనిరుధ్ సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోను షేర్ చేశారు. జీవితంలో ఒక్కసారే దొరికే వ్యక్తి, జీవితాంతం తనతోనే ఉంటారనే అర్థంతో క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి భారీగా లైకులు వచ్చాయి. నవంబర్ 21న చెన్నైలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు.





నిజానికి అనిరుధ్‌కు సన్ పిక్చర్స్‌తో పరిచయం ఇప్పటిది కాదు. రజనీకాంత్ 'పేట', 'జైలర్', 'కూలీ' వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఈ చిత్రాలను సన్ పిక్చర్స్ నిర్మించింది. ముఖ్యంగా 'జైలర్' విజయంలో అనిరుధ్ పాటలు, బీజీఎం ఎంతగా ఉపయోగపడ్డాయో తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థ కుటుంబంతో ఆయనకు వ్యక్తిగతంగా కూడా బంధం ఏర్పడింది.





ఇక అనిరుధ్ కుటుంబానికి కూడా తమిళ సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. ఆయన రజనీకాంత్ భార్య లతకు మేనల్లుడు. చిన్న వయసులోనే '3' సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమై, 'కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయ్, అజిత్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ల సినిమాలకు పనిచేశారు. తెలుగులోనూ 'జెర్సీ', 'దేవర' వంటి సినిమాలకు సంగీతం అందించారు.





మరోవైపు కావ్య మారన్ పేరు వినగానే చాలామందికి సన్‌రైజర్స్ హైదరాబాద్ గుర్తుకొస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో కనిపించే ఆమెకు క్రికెట్ అభిమానుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె కుటుంబానికి టీవీ ఛానళ్లు, సినిమా నిర్మాణం, క్రికెట్ ఫ్రాంచైజీలతో వ్యాపార సంబంధాలున్నాయి.