డేట్స్ కూడా ఫిక్స్ చేశారా? మరి క్లారిటీ వచ్చేదెప్పుడు?
గత కొంతకాలంగా అనిరుధ్, కావ్య రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
By: M Prashanth | 12 July 2026 12:11 AM ISTసోషల్ మీడియాలో ఒక వార్త ఎంత స్పీడ్ గా వైరల్ అవుతుందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి చర్చే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ గురించి నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మరోసారి జోరందుకుంది. అంతేకాదు.. ఈసారి కేవలం పెళ్లి వార్తలతోనే కాకుండా, వివాహ తేదీలు కూడా ఖరారయ్యాయని, వేడుక ఎక్కడ జరగబోతోందో కూడా నెట్టింట వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
గత కొంతకాలంగా అనిరుధ్, కావ్య రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దానిపై వారిద్దరూ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం అనిరుధ్ స్వయంగా ఆ రూమర్లను ఖండించారు కూడా. దీంతో ఆ వార్తలకు కొంతకాలం బ్రేక్ పడింది. కానీ ఇటీవల మళ్లీ అదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ప్రచారానికి కారణం అనిరుధ్ కుటుంబానికి చెందిన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలే.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనిరుధ్ వివాహం గురించి ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ కొత్త చర్చ మొదలైంది. ఆ కామెంట్స్ తర్వాతే వీరి పెళ్లి వార్తలకు మరింత ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ లో మూడు రోజుల పాటు వివాహ వేడుకలు నిర్వహించనున్నారని, అందులో ఒక రోజు పెళ్లి ముహూర్తం ఉంటుందని కొన్ని కోలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
అలాగే విదేశాల్లోని ప్రముఖ డెస్టినేషన్ లో వివాహాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ వివరాలపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అదే సమయంలో మరో అంశం చర్చకు వస్తోంది. సన్ గ్రూప్ కు చెందిన నిర్మాణ సంస్థ రూపొందించిన పలు చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించారు. ఆ సమయంలో అనిరుధ్, కావ్యకు పరిచయం ఏర్పడిందని, ఆ స్నేహమే ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని ప్రచారం సాగుతోంది.
అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం అనిరుధ్ వరుస సినిమాలతో సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నారు. దక్షిణాదితో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆయనకు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వ్యవహారాలను చూసుకుంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి పెళ్లిపై మరోసారి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని చెప్పలేం. వివాహ తేదీలు, వేదికపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ.. అనిరుధ్ లేదా కావ్య కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం రూమర్లుగానే భావించాల్సి ఉంటుంది. నిజంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయా? నెట్టింట వైరల్ అవుతున్న తేదీలే ఖరారయ్యాయా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
