Begin typing your search above and press return to search.

అనిరుధ్ రవిచందర్ - మ్యూజిక్ సెన్సేషన్!

ప్రస్తుతం అత్యంత క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే? మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్.

By:  Srikanth Kontham   |   1 July 2026 10:58 PM IST
అనిరుధ్ రవిచందర్ - మ్యూజిక్ సెన్సేషన్!
X

ప్రస్తుతం అత్యంత క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే? మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. తనదైన శైలి నేపథ్య సంగీతం ..ఎనర్జిటిక్ సాంగ్స్‌తో అనిరుధ్ ప్రత్యేకమైన బ్రాండ్‌గా ఎదిగారు. కొన్నేళ్లుగా సౌత్ ఇండియా నుండి పాన్-ఇండియా స్థాయి వరకు ఆయన మ్యూజిక్ వినిపించని పెద్ద సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అనిరుద్ ప్రయాణం కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా ఒక బాక్సాఫీస్ పుల్ ఫ్యాక్టర్‌గా రూపాంతరం చెందింద‌న్న‌ది అంతే వాస్త‌వం. అనిరుధ్ మ్యూజిక్ అంటే చాలు? ఆ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు అనిరుద్ మొదటి ఎంపికగా మారారు. మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే బీట్స్ ఇవ్వడంలో అనిరుధ్ చూపే ప్రతిభ, చిత్ర నిర్మాణ సంస్థలకు గొప్ప ధీమాను ఇస్తోంది. నిర్మాతలు సైతం అనిరుధ్ సంగీతం కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు. ఎందుకంటే ఆయన అందించే సౌండ్ టెక్స్చర్స్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తున్నాయి. ఈ అపారమైన క్రేజ్ .. డిమాండ్ నేపథ్యంలో అనిరుధ్ పారితోషికం కూడా రికార్డు స్థాయిలో ఉందని సమాచారం. ప్రస్తుతం ఆయన ఒక్కో భారీ చిత్రానికి సుమారు 20 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇంతటి భారీ మొత్తం చెల్లించడం అనేది అనిరుధ్ మార్కెట్ సామర్థ్యాన్ని -ఆయన పేరుతో సినిమాకు వచ్చే బజ్ ను ప్రతిబింబిస్తోంది. అనిరుధ్ విజయం వెనుక ఉన్న మ‌రో ప్రధాన రహస్యం కాలాను గుణమైన మార్పు. ట్రెండ్‌ను అనుసరించడమే కాకుండా ట్రెండ్‌ను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్స్‌ను, యూత్ పల్స్‌ను పక్కాగా పట్టుకుని అందుకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించడంలో అనిరుద్ దిట్ట. ప్రతి పాటలోనూ కొత్తదనం, ప్రతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లోనూ ఒక ఇంటెన్సిటీ ఉండటం వల్లనే అనిరుద్ ఇంత వేగంగా అగ్రస్థానానికి చేరుకోగలిగారు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

అనిరుధ్ కేవలం సంగీతం మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆడియో లాంచ్ ఈవెంట్లలో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతున్నాయి. ప్రేక్షకులు మ్యూజిక్ డైరె క్టర్‌ను కేవలం తెర వెనుక ఉండే వారిగా కాకుండా? స్టార్ హీరో స్థాయి క్రేజ్ ఉన్న వ్యక్తిగా చూడటం టాలీవుడ్ - కోలీవుడ్‌లో అనిరుధ్‌తోనే మొదలైందనే చెప్పొచ్చు. తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో అనిరుధ్ సృష్టించిన సామ్రాజ్యం ముందు ముందు మరిన్ని అద్భుతాలకు వేదిక కానుంది. భారీ పారితోషికాలు ..భారీ ప్రాజెక్టులు ఆయన ప్రతిభకు దక్కిన గౌరవంగానే చూడాలి. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం అనిరుద్ తెలుగు, త‌మిళ్ లో చాలా సినిమాల‌కు సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనిరుద్ ఎంట్రీతో రెహ‌మాన్ లాంటి వాళ్లే ఖాళీ అయిపోతున్నారంటే? యంగ్ సెన్షేష‌న్ ప్ర‌భావం ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు.