Begin typing your search above and press return to search.

DC కంటే ముందు అనిరుధ్ స్టైల్ BGMతో పైకి లేపిన టాప్ -5 సినిమాలు

ఒక సినిమా విజయంలో కథ, కథనాలు ఎంత ముఖ్యమో... దానికి ప్రాణం పోసే నేపథ్య సంగీతం (BGM) కూడా అంతే ముఖ్యం.

By:  Sivaji Kontham   |   12 Aug 2026 11:55 PM IST
DC కంటే ముందు అనిరుధ్ స్టైల్ BGMతో పైకి లేపిన టాప్ -5 సినిమాలు
X

ఒక సినిమా విజయంలో కథ, కథనాలు ఎంత ముఖ్యమో... దానికి ప్రాణం పోసే నేపథ్య సంగీతం (BGM) కూడా అంతే ముఖ్యం. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన DC (2026) సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డెబ్యూ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి నటన, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ ఆకట్టుకున్నా వాట‌న్నిటినీ మించి అనిరుధ్ తన బలమైన స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రేక్షకులతో పాటు విమర్శకులూ ప్రశంసించారు.

అయితే అనిరుధ్ తన నేపథ్య సంగీతంతో ఒక సినిమా రేంజ్‌ను మార్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` చిత్రమే దీనికి పెద్ద ఉదాహరణ. జైలర్ కథాంశం పరంగా కాస్త సాధారణంగా అనిపించినా.. అనిరుధ్ ఇచ్చిన మాస్ ఎలివేషన్ బీజీఎమ్స్ థియేటర్లను ఊపేశాయి. టైగర్ హుకుమ్ థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని అందించి సాధారణ సీన్లను కూడా నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

అదేవిధంగా కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన `విక్రమ్` సినిమా విజయంలో అనిరుధ్ మ్యూజిక్ ఒక తుఫానులా పనిచేసింది. కమల్ హాసన్ పునరాగమనానికి తగ్గట్టుగా అనిరుధ్ డిజైన్ చేసిన `ఏజెంట్ విక్రమ్` థీమ్, విలన్ రోలెక్స్ ఎంట్రీ ఇచ్చే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. బీజీఎమ్ విజువల్స్‌కు ఇచ్చిన హైప్ కారణంగానే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇక విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `మాస్టర్`, `లియో` చిత్రాలు కూడా అనిరుధ్ సంగీత బలంతోనే బాక్సాఫీస్ దగ్గర రికార్డు ఓపెనింగ్స్ సాధించాయి. మాస్టర్ చిత్రంలో భవాని క్యారెక్టర్‌కు ఇచ్చిన ఒక ప్ర‌త్యేక‌మైన‌ బీజీఎమ్, హీరో ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే `లియో`లో బాడాస్ థీమ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సుల్లో అనిరుధ్ ఇచ్చిన స్కోర్ ప్రేక్షకులచేత ఈలలు వేయించాయి. ఇవేవీ క‌థాంశం ప‌రంగా చెప్పుకోద‌గ్గ గొప్ప సినిమాలు కావ‌ని క్రిటిక్స్ విమ‌ర్శించారు. అయినా అనిరుధ్ లాంటి మ్యాజికల్ మ్యూజిక్ క్రియేట‌ర్ ఆ సినిమాల ఫేట్ ని డిసైడ్ చేసార‌ని కూడా క్రిటిక్స్ ప్ర‌శంసించారు.

ఈ జాబితాలో కోలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`.. పవన్ కళ్యాణ్ `అజ్ఞాతవాసి` చిత్రాలను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జెర్సీలో నాని రైల్వే స్టేషన్ సీన్‌లో వచ్చే ఎమోషనల్ బీజీఎమ్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోగా, అజ్ఞాతవాసి ఫలితం ఎలా ఉన్నా అందులోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాట‌లు ఇప్పటికీ అనిరుధ్ ఉత్తమ వర్క్‌లలో ఒకటిగా నిలిచాయి. ఇలా కథలోని లోపాలను సైతం కప్పిపుచ్చి.. తన సంగీతంతో సినిమాలను హిట్ ట్రాక్‌పై నిలబెట్టడంలో అనిరుధ్ స్టైలే వేరు.