ఏఐ ఎంతో అద్భుతమైంది.. కానీ!
సినీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా సంగీత రూపకల్పనలో ఇది కొత్త దిశలను తెరుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 24 Feb 2026 5:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా సంగీత రూపకల్పనలో ఇది కొత్త దిశలను తెరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏఐ వినియోగంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐను అద్భుతమైన సాధనంగా అభివర్ణించిన ఆయన, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.
వేట్టయాన్ లో ఏఐ తో ప్రయోగం
ఈ సందర్భంగా తాను సంగీతం అందించిన వేట్టయాన్ మూవీలో ఏఐ టెక్నాలజీ వినియోగంపై కూడా ఆయన మాట్లాడారు. వేట్టయాన్ మూవీలో లెజెండరీ సింగర్ మలేషియా వాసుదేవన్ గొంతుని ఏఐ సాయంతో రీక్రియేట్ చేయగా, ఈ ఎక్స్‌పెరిమెంట్ సంగీత ప్రపంచంలో విశేష స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంతో గత జెనరేషన్ సింగర్ల గొంతులను గౌరవప్రదంగా తిరిగి వినిపించొచ్చని ప్రూవ్ అయినట్టు అనిరుధ్ తెలిపారు.
ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది
కేవలం ఒక సంవత్సరంలోనే ఏఐ సామర్థ్యం విపరీతంగా అభివృద్ధి చెందిందని కూడా అనిరుధ్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతమున్న టెక్నాలజీతో తాను ఒక లైన్ పాడితే, దాన్ని ఏఐ సాయంతో 100 మంది అమ్మాయిల గొంతులుగా మార్చుకోవచ్చని, పిచ్, టోన్ ను మార్చి వేర్వేరు శృతిల్లో పాడుతున్నట్టుగా కూడా మార్చే వీలుందని వివరించారు. ఏఐ త్వరలోనే మ్యూజిక్ కంపోజిషన్ లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని అనిరుధ్ అభిప్రాయపడ్డారు.
క్రియేటివ్ హెల్పర్ గా మారే అవకాశం
ఏఐ వినియోగంపై అనిరుధ్ సమతుల్య దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఏఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇదొక ఎర్లీ బర్డ్ మాత్రమేనని, ఫ్యూచర్ లో ఏఐ మరింత శక్తివంతంగా మారి మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరి పనిలో భాగమవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. దాంతో పాటూ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం ఏఐ ఒక క్రియేటివ్ హెల్పర్ గా కూడా మారవచ్చని అనిరుధ్ అభిప్రాయపడ్డారు.
తగిన పరిమితుల్లో వాడటం ముఖ్యం
మ్యూజిక్ కంపోజిషన్ అనేది ఏఐ వల్ల మరింత సులభమవడమే కాకుండా, కొత్త సౌండ్స్ ను అన్వేషించడంలో కూడా అవకాశాలను విస్తరించగలదని, అయితే టెక్నాలజీని జాగ్రత్తగా, తగిన పరిమితుల్లో ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని అనిరుధ్ సూచించారు. మొత్తంగా చూస్తే, అనిరుధ్ కామెంట్స్ సినీ సంగీతంలో ఏఐ ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో, ఏఐ త్వరలోనే చిత్ర నిర్మాణం, సౌండ్ డిజైన్, మ్యూజిక్ కంపోజింగ్ లాంటి విభాగాల్లో సాధారణ సాధనంగా మారే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సంగీత ప్రపంచం ఇప్పుడు సాంకేతిక పరిణామాల దిశగా అడుగులేస్తుండగా, ఏఐ దాని ఫ్యూచర్ ను ఎలా మలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
