Begin typing your search above and press return to search.

మాస్ బీట్స్ పక్కన పెట్టి.. అనిరుధ్ ఎటు వెళ్తున్నాడు?

పెద్ద హీరో ఎలివేషన్లు లేకుండా పాటలే కథలో భాగమయ్యే సినిమాలు కూడా ఇప్పుడు అతని లైనప్‌లో ఉన్నాయి.

By:  M Prashanth   |   18 Sept 2026 10:37 AM IST
మాస్ బీట్స్ పక్కన పెట్టి.. అనిరుధ్ ఎటు వెళ్తున్నాడు?
X

అనిరుధ్ పేరు వినగానే ఇప్పటికీ ఎక్కువ మందికి స్టార్ హీరోల సినిమాలే గుర్తుకొస్తాయి. హీరో ఎంట్రీ, యాక్షన్ బ్లాక్, థియేటర్‌లో వైబ్ అయ్యే పాటలు.. గత కొన్నేళ్లుగా ఆయన ఎక్కువగా పనిచేసింది కూడా అలాంటి సినిమాలకే. విక్రమ్, జైలర్, లియో, ‘దేవర’ తర్వాత ఆ ఇమేజ్ మరింత బలపడింది. అయితే ఈ మధ్య లైనప్ చూస్తే ఆ ఒక్క రూట్‌తోనే వెళ్లడం లేదు. జైలర్ 2 లాంటి భారీ సినిమా ఒకవైపు ఉన్నా, మరోవైపు సంగీతానికే ఎక్కువ పని ఉన్న కథలను కూడా ఎంచుకుంటున్నారు.

‘జెర్సీ’లోనే అనిరుధ్ తన రెగ్యులర్ మాస్ స్టైల్‌కు భిన్నంగా మంచి మెలోడీస్ ఇచ్చారు. ఇప్పుడు ది ప్యారడైజ్ లో తెలంగాణ ఫోక్ ట్యూన్‌ను తీసుకుని ‘యేష నాగుల’గా కొత్తగా చేశారు. మరోవైపు గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’లో నలుగురు టీనేజర్లు ఒక ఒరిజినల్ సాంగ్ కోసం కలిసి పనిచేసే కథకు సంగీతం అందిస్తున్నారు. అది కమింగ్ ఆఫ్ ఏజ్ మ్యూజికల్ డ్రామా. పెద్ద హీరో ఎలివేషన్లు లేకుండా పాటలే కథలో భాగమయ్యే సినిమాలు కూడా ఇప్పుడు అతని లైనప్‌లో ఉన్నాయి.

ఇప్పుడు వాటన్నింటికంటే పూర్తిగా వేరే పని అనిరుధ్ చేతికి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న చెన్నై మ్యూజిక్ అకాడమీలో ప్రారంభమైంది. లాంచ్‌కు వచ్చిన కమల్ హాసన్ కూడా ఈ సినిమా అనిరుధ్ కెరీర్‌ను మరో ట్రాక్ లోకి తీసుకెళ్లొచ్చని ప్రత్యేకంగా చెప్పారు.

ఎంఎస్ జీవితంలో సంగీతం ఒక భాగం కాదు.. అదే ఆమె ప్రయాణం. చిన్న వయసులోనే కచేరీలు మొదలుపెట్టి, తర్వాత దేశం దాటి పేరు తెచ్చుకున్నారు. 1966లో ఐక్యరాజ్యసమితి వేదికపై పాడారు. భారతరత్న అందుకున్న తొలి సంగీతకారిణిగా నిలిచారు. అలాంటి జీవితకథలో పాటలను కేవలం సినిమా కోసం కొత్తగా కంపోజ్ చేయడం సరిపోదు. ఆమె పాడిన కీర్తనలు, భజనలు, కర్ణాటక సంగీతం అన్నీ కథతో కలిసి రావాల్సి ఉంటుంది.

ఇప్పటికే తరతరాలుగా వినిపిస్తున్న పాటలను ఎంతవరకు ఒరిజినల్ రూపంలో ఉంచుతారు, ఎక్కడ కొత్త అరేంజ్‌మెంట్స్ చేస్తారు, రష్మిక కోసం ప్లేబ్యాక్ ఎవరిని తీసుకుంటారు అన్నవి ఇంకా బయటకు రాలేదు. అనిరుధ్ మాస్ బీట్స్‌తో వెంటనే గుర్తుపట్టే తన స్టైల్‌ను తగ్గించి, ఎంఎస్ సంగీత ప్రపంచానికి దగ్గరగా వెళ్లాల్సి ఉంటుంది. ‘జెర్సీ’లో ఎమోషన్‌కు తగ్గ మ్యూజిక్ ఇచ్చిన అనుభవం ఉన్నా, ఇక్కడ క్లాసికల్ సంగీతమే కథకు ఆధారం.

గౌతమ్‌తో అనిరుధ్‌కు ఇది కొత్త కాంబినేషన్ కాదు. జెర్సీ, కింగ్‌డమ్, మ్యాజిక్ తర్వాత ఇప్పుడు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. కానీ ఈసారి సంగీతం ఎలా ఉండబోతోందన్న ప్రశ్న ఎక్కువగా వస్తోంది. ఎంఎస్ బయోపిక్ నుంచి మొదటి పాట బయటకు వచ్చిన రోజే అనిరుధ్ కొత్త రూట్‌ ఏంటో అర్థమవుతుంది. చూడాలి మరి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.