ఒక శుభలేఖ ఖరీదు రూ.20,000 .. అనిరుధ్- కావ్య పెళ్లి ఖర్చు ఊహిస్తేనే!
అయితే ఈ వేడుకల హంగులు- వివాహ శుభలేఖల ఖర్చుపై నెటిజన్లు ఆసక్తికరమైన పోలికలను లేవనెత్తుతున్నారు.
By: Sivaji Kontham | 31 Oct 2026 9:38 AM ISTసౌతిండియా పాపులర్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి కావ్యా మారన్ల వివాహం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనిరుధ్ ఇంట్లో పెళ్లి వేడుకల సందడి మొదలైందంటూ.. ఆయన డోలక్ వాయిద్యంపై కూర్చొని నవ్వుతూ ఉన్న విజువల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గ్రీస్ దేశంలో నవంబర్ 10, 11 తేదీలలో అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని.. అనంతరం నవంబర్ 21న చెన్నైలో ప్రముఖులతో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారనే ప్రచారం ఈ వివాహ వార్తలకు మరింత ప్రాధాన్యత చేకూర్చింది.
అయితే ఈ వేడుకల హంగులు- వివాహ శుభలేఖల ఖర్చుపై నెటిజన్లు ఆసక్తికరమైన పోలికలను లేవనెత్తుతున్నారు. దాదాపు 40,000 కోట్ల నికర ఆస్తి కలిగిన కళానిధి మారన్ కుటుంబం 20,000 విలువైన ఒక్కో ఆహ్వాన పత్రాన్ని ముద్రించడం సామాన్యుల దృష్టిలో అద్భుతంగా అనిపించినా.. వారి సంపద నిష్పత్తిలో అది చాలా స్వల్పమనే విశ్లేషణ తెరపైకి వచ్చింది. 40 లక్షల ఆస్తి ఉన్న సగటు వ్యక్తి రూ.20 విలువైన కార్డును ప్రింట్ చేయడం కంటే, శతకోటీశ్వరులు వారి ఆస్తిలో 0.000005 శాతం నిధులను కార్డు కోసం వెచ్చించడం చాలా సాధారణ విషయమని.. వారి స్థాయిలో ఇది హంగు ఆర్భాటం లేని సాధారణ వేడుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ వేడుకకు సంబంధించిన అతిథుల జాబితా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భారీ స్థాయిలో వేలాది మందితో కాకుండా కేవలం 500 మంది విఐపి అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారనే వార్తలు అతి సంపన్నుల వ్యక్తిగత గోప్యత- ఎంపిక చేసిన పరిమిత వేడుకల ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఇటువంటి ప్రకటనలు నిజమేనా లేదా కేవలం అసత్య ప్రచారాలా అనే సందేహాలను కూడా పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తూ ఈ హడావుడిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నెటిజనులలో డిబేట్:
ఈ సంచలన వార్తల మధ్య అనిరుధ్ సాంప్రదాయ వాయిద్యంపై కూర్చున్న విజువల్స్ నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. సంగీత పరికరాలను దైవంగా భావించే సాంప్రదాయ సంస్కృతికి భంగం కలిగిస్తూ డోలక్‌పై కూర్చోవడం కళను అవమానించడమేనంటూ నెటిజన్లు మండిపడ్డారు. అనతికాలంలో వచ్చిన అధిక సంపద, పేరు ప్రఖ్యాతల వల్ల పెరిగిన అహంకారమే ఇలాంటి చర్యలకు కారణమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా, సదరు దృశ్యాలు వీక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై స్పందించిన కొందరు నెటిజన్లు అసలు నిజాన్ని బయటపెడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది అనిరుధ్ సొంత పెళ్లి వేడుక కాదని.. ఆయన బంధువుల (బావ-వదిన) వివాహంలో భాగంగా జరిగిన సరదా ఘట్టమని స్పష్టం చేశారు. కేవలం అనధికారిక వార్తల ఆధారంగా పుకార్లు షికారు చేస్తున్నాయని తేల్చిచెప్పారు. అంతిమంగా క్రీడా, సినీ, వ్యాపార రంగాల కలయికగా భావిస్తున్న ఈ పెళ్లి వార్తపై నెటిజన్లలో ఉన్న అపోహలు, సాంప్రదాయ విమర్శలు.. సరదా వ్యాఖ్యల నడుమ ఈ అంశం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న విషయం తెలిసిందే. అంబానీల తరహాలోనే వందల కోట్లు ఈ పెళ్లి కోసం మారన్ కుటుంబం వెచ్చిస్తోందన్న చర్చా వేడెక్కిస్తోంది.
