ఎఫ్ 2 వల్లే సరిలేరు.. నిజం కాదన్న నిర్మాత
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా సాగుతూ వచ్చింది.
By: Ramesh Palla | 7 Sept 2025 12:20 PM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా సాగుతూ వచ్చింది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ట్రాక్ రికార్డ్‌ను మ్యాచ్ చేస్తూ అనిల్ రావిపూడి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఈ ఏడాదిలో ఆయన నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా పట్టాలెక్కింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎఫ్ 2 సినిమా కంటే ముందే మహేష్ బాబుతో..
అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దాదాపు అన్ని వినోదాత్మక సినిమాలు అనే విషయం తెల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి దిల్ రాజు బ్యానర్‌తో అనిల్ రావిపూడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే ఖచ్చితంగా దిల్ రాజు ఇన్వాల్వ్‌మెంట్ ఏదో రకంగా ఉంటుంది అంటూ ఉంటారు. అలా దిల్ రాజు బ్యానర్ లో చేసిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు పిలిచి మరీ అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదని నిర్మాత అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు చేసిన ఆ సినిమా చాలా ఒత్తిడి మధ్య చేసినట్లు అనిల్ సుంకర తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు
నిర్మాత అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మహేష్ బాబు వరుసగా బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో డిజస్టర్‌లను చవిచూశారు. ముఖ్యంగా స్పైడర్ సినిమా విడుదల అయిన వెంటనే నేను వెళ్లి మహేష్ బాబు గారిని కలిశాను. అతడు వంటి ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను చేద్దాం అనుకున్నాం. అప్పుడే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తే బాగుంటుంది అని మహేష్ గారికి సలహా ఇచ్చాను. ఆయన మరో మాట మాట లేకుండా ఓకే చెప్పారు. అప్పుడు మహర్షి సినిమా కారణంగా దిల్ రాజు వద్ద మహేష్ బాబు గారి డేట్లు ఉన్నాయి. మరో వైపు ఎఫ్ 2 సినిమా కోసం అనిల్ రావిపూడి డేట్లు దిల్ రాజు వద్ద ఉన్నాయి.
దిల్ రాజు నిర్మాతగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి
మహేష్ బాబు, అనిల్ రావిపూడి ఇద్దరి డేట్లు కూడా దిల్ రాజు వద్ద ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండా నేను ఇద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేశాను. సరిలేరు నీకెవ్వరు సినిమా స్టోరీ లైన్ చెప్పిన వెంటనే మహేష్ బాబు గారు ఎగ్జైట్ అయ్యారు. తప్పకుండా చేసేద్దాం అన్నారు. అయితే అప్పటికే ఇద్దరూ దిల్ రాజు గారి వద్ద ఉండటం వల్ల సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మాణంలో దిల్ రాజు గారు కూడా చేరాల్సి వచ్చిందని అన్నారు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబో మూవీ అనగానే చాలా మందికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎఫ్ 2 హిట్ అయింది కనుక అనిల్ కి మహేష్ ఓకే చెప్పి ఉంటాడని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఎఫ్ 2 సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టక ముందే ఈ సినిమా కన్ఫర్మ్ అయిందని అనిల్ సుంకర ఆసక్తిర వ్యాక్యలు చేశారు. మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రావాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.
