ప్రభాస్ పై డైరెక్టర్ అనిల్ ఆసక్తికర కామెంట్స్..
ఇదే సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. విషయంలోకి వెళ్తే..
By: Madhu Reddy | 30 Dec 2025 4:25 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని అనిల్ రావిపూడి తన బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి చిత్రపటం తోపాటు ప్రసాదం ఆయనకు ఆలయ అధికారులు అందజేశారు. ఆ తర్వాత వేద పండితులు అనిల్ రావిపూడిని ఆశీర్వదించారు. ఇక ఆలయం బయట విలేకరులతో మాట్లాడుతూ.." సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాడిన పాట చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది" అని తెలిపారు. ఇక ఈరోజు సాయంత్రం తాను గుంటూరులో చదివిన కాలేజీలో చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న పాటను రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. అంతేకాదు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు కూడా తెలిపారు అనిల్ రావిపూడి.
ఇదే సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. విషయంలోకి వెళ్తే.. ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ సీనియర్స్ తర్వాతే మేము అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయంపై స్పందించాలని విలేకరులు అనిల్ రావిపూడిని అడగగా ఆయన మాట్లాడుతూ.. "ఈ విషయం గురించి రేపు ఒక పెద్ద ఈవెంట్ లో నేను ప్రత్యేకంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ స్టేట్మెంట్ ప్రభాస్ గారి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్ కి.. ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్సాఫ్. అందుకే ఆయనను డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. ఆయన వ్యక్తిత్వమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది. కచ్చితంగా మా తరఫున ది రాజా సాబ్ జనవరి 8న ప్రీమియర్ షో కి వెళ్తాము" అంటూ కామెంట్ చేశారు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. నయనతార హీరోయిన్ గా రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి బరిలోకి దిగబోతోంది ఈ సినిమా.
