టైమ్ మిషన్ లో జర్నీ చేసినట్టు అనిపిస్తుంది
టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Jan 2026 4:16 PM ISTటాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి కొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా అనిల్ మీడియాతో ముచ్చటించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.
స్పెషల్ సంక్రాంతి ముద్ర ప్రెజర్ ను పెంచుతుంది
ఎంటర్టైనింగ్ సినిమాలు సంక్రాంతికి వస్తే వాటికి మంచి రెస్పాన్స్ వస్తాయని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయని, ఈ ఇయర్ సంక్రాంతికి కూడా అన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలే వస్తున్నాయని, అన్నీ సినిమాలూ సక్సెస్ అవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు అనిల్ సంక్రాంతికి వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడనే గుర్తింపు చాలని, తనపై స్పెషల్ గా సంక్రాంతి ముద్ర వస్తే అది ఒత్తిడిని పెంచుతుందని అన్నారు.
బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా
మన శంకరవరప్రసాద్ గారు సినిమా కామెడీతో పాటూ స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పిన అనిల్, ఈ మధ్యకాలంలో తాను ఇలాంటి సినిమా చేయలేదని, చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బావగారు బాగున్నారా, చూడాలని ఉంది లాంటి ఫ్యామిలీ సినిమాలను చేయలేదని, ఆయనతో సినిమా చేస్తే ఈ జానర్ లోనే సినిమా చేయాలని ఈ కథను రాసుకున్నానని అనిల్ చెప్పారు. తన ఆలోచన చెప్పగానే చిరూ, వెంకీ ఇద్దరికీ నచ్చిందని, ఈ మూవీలో చిరూ స్క్రీన్ పై చేసే అల్లరి, మాస్ సీన్స్, ఎమోషన్స్ చూస్తున్నప్పుడు టైమ్ మిషన్ ఎక్కి జర్నీ చేసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు. సినిమా బడ్జెట్ విషయంలో తాను తీసుకునే జాగ్రత్తల గురించి కూడా అనిల్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. సినిమాకు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనే విషయాల్లో నిర్మాతల కంటే తానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటానని, సినిమా షూటింగ్ కు అయ్యే రోజూ వారీ ఖర్చు తనకు వాట్సాప్ లో వస్తుంటుందని దాన్ని బట్టి తానే నిర్మాతలా ఆలోచించి సినిమాలు తీస్తుంటానని అన్నారు.
తమ జీవితాల్ని పణంగా పెట్టి నిర్మాతలు సినిమాలు చేస్తారని, కథను, డైరెక్టర్లను నమ్మి నిర్మాతలు సినిమాలు చేస్తారని, అలాంటప్పుడు వారిని సంతోషంగా ఉంచే బాధ్యత డైరెక్టర్లదేనని, సినిమా బయటికొచ్చేసరికి నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగొచ్చిందనే భరోసాతో ఉండాలని, మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని, ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తుంటారని చెప్పారు.
ఆ సినిమా కూడా చేస్తే రికార్డు వస్తుంది
సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో సినిమాలు చేశానని, మరో స్టార్ హీరో అయిన నాగార్జునతో సినిమా ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారని, ఆయనతో కూడా సినిమా చేస్తే నలుగురు స్టార్ హీరోలతో సినిమా చేసిన ఈ జెనరేషన్ డైరెక్టర్ గా రికార్డు దక్కుతుందని చెప్పారు. వెంకీని ఈ సినిమాలో నటించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, చిరూ, వెంకీ తనకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని, వారి మధ్య మంచి బాండింగ్ ఉందని, వారిద్దరూ కలిసి చేసిన 18 రోజుల షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, మనం నిజాయితీగా ఒకటి కోరుకున్నప్పుడు, అందులోని ఉద్దేశం అవతలివాళ్లకు అర్థమైనప్పుడు అన్నీ అనుకూలంగా జరుగుతాయని తాను నమ్ముతానని, నయనతార విషయంలో కూడా అదే జరిగిందని, అడగ్గానే ఆమె ప్రమోషనల్ వీడియోలు చేశారని అనిల్ చెప్పారు.
