సంక్రాంతి రేసులో అనిల్‌తో రెండు పోటీలు
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం ఒక లెక్క. అదే పండగ మూడ్‌కు సరిపోయే సినిమాను రెడీ చేయడం మరో లెక్క.
By: M Prashanth | 17 Aug 2026 12:16 PM ISTసంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం ఒక లెక్క. అదే పండగ మూడ్‌కు సరిపోయే సినిమాను రెడీ చేయడం మరో లెక్క. అనిల్ రావిపూడికి మాత్రం ఈ రెండింటి మీద మంచి పట్టు వచ్చింది. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు నుంచి సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వరకు ఈ సీజన్‌తో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు వెంకటేష్ కల్యాణ్ రామ్ మల్టీస్టారర్‌తో 2027 సంక్రాంతిని కూడా ముందే బుక్ చేసుకున్నాడు.
ఈసారి పోటీ కూడా చిన్నది కాదు. సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ జనవరి 12కు వస్తోంది. శర్వానంద్ శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ జనవరి 14 డేట్ వేసుకుంది. ఇంకా కొన్ని సినిమాలు ఇదే సీజన్‌ను చూస్తున్నాయి. అంటే థియేటర్ల దగ్గర అసలు క్లాష్ మొదలయ్యేలోపే ప్రేక్షకుడి దృష్టిని ఎవరు ముందుగా పట్టుకుంటారన్న పోటీ ఉంటుంది. అక్కడే అనిల్ దగ్గర ఇంకో ప్లస్ కనిపిస్తుంది. ఆయన సినిమాకు ప్రమోషన్స్ అంటే ఇంటర్వ్యూలు, ట్రైలర్‌తో సరిపెట్టడం లేదు. సినిమా కామెడీ టోన్‌ను రిలీజ్‌కు ముందే చిన్న వీడియోల్లోకి తీసుకొస్తాడు.
కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యే ముందే వెంకీ, కల్యాణ్ రామ్‌తో చేసిన ‘కత్తిలాంటి ఐడియా’ ఫన్ వీడియోను వదిలారు. అంటే మొదటి రౌండ్ పోటీ అప్పుడే మొదలైపోయింది. ఇంకా జీవి ప్రకాశ్ తో చేసిన క్లిప్ కూడా క్లిక్ అయ్యింది. మొదట్లోనే ఈ డోస్ ఉంటే ముందు ముందు ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ఇక రెండో రౌండ్ థియేటర్లలో ఉంటుంది. సంక్రాంతి సెలవుల్లో ఒకేసారి రెండు మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆడియన్స్‌కు చూసే టైమ్ ఉంటుంది.
కానీ అందులో ఫ్యామిలీస్‌ను ఎక్కువగా లాగే సినిమా నెంబర్స్‌లో ముందుకెళ్లే ఛాన్స్ పెరుగుతుంది. అనిల్ గత సినిమాల్లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, పండగకు సరిపోయే లైట్ మూడ్ పని చేసింది. అదే ఆయనకు ఈ సీజన్‌లో ఉపయోగపడుతున్న అసలు బలం. అయితే ఈసారి అన్ని సినిమాలనూ ఒకే తూకంలో వేయలేం. ‘సంబరాల ఏటిగట్టు’ పీరియడ్ యాక్షన్ జోన్‌లో ఉంది. ‘జార్జ్ క్రిష్’ను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు.
అనిల్ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే వస్తోంది. కాబట్టి అసలు డైరెక్ట్ పోటీ ఏ సినిమాల మధ్య ఏర్పడుతుందో ప్రమోషనల్ కంటెంట్ బయటకొచ్చాకే ఇంకా క్లియర్ అవుతుంది. ప్రమోషన్స్‌తో ముందుగా నవ్వించడం ఒక అడ్వాంటేజ్ మాత్రమే. అదే నవ్వు సినిమాలోనూ పని చేయాలి. 2027 రేసులో మిగతా సినిమాలు అనిల్‌తో థియేటర్ల దగ్గర ఒక్కసారే కాదు.. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుడి అటెన్షన్ కోసం కూడా పోటీ పడాల్సి రావడం మాత్రం ఇంట్రెస్టింగ్ లెక్క.
