మెగాస్టార్ కాకుండా ఇంకొకరైతే మళ్లీ ఛాన్స్ ఇవ్వరు
లైఫ్ లో ఏది ఎప్పుడు జరగాలనేది ముందే రాసిపెట్టుటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఎంతో అనుభవం తర్వాత ఎన్నో చూశాకే వారు ఏదైనా అంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Dec 2025 7:00 PM ISTలైఫ్ లో ఏది ఎప్పుడు జరగాలనేది ముందే రాసిపెట్టుటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఎంతో అనుభవం తర్వాత ఎన్నో చూశాకే వారు ఏదైనా అంటారు. ఆ విషయం ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా వరుసగా 8 హిట్లు అందుకున్న అనిల్ రావిపూడి ఖాతాలో ఇప్పటివరకు ఫ్లాపనేదే లేదు. అతను చేసిన ప్రతీ సినిమా హిట్టే.
మొదటిసారి చిరంజీవితో సినిమా
అలాంటి అనిల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అనిల్, చిరంజీవి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ హైప్, అంచనాలు నెలకొన్నాయి.
ముందే చేయాల్సింది
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి చిరంజీవితో తన సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మన శంకరవరప్రసాద్ గారు కంటే ముందే తాను చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉందని, ఓ సబ్జెక్ట్ అనుకుని మెగాస్టార్ దగ్గరకు వెళ్లానని, కానీ అది సెట్ అవలేదని, స్లాట్ విషయంలో డిలే అవుతుందని, ఇంకా చెప్పాలంటే తానే మధ్యలో తుర్రుమని వెళ్లిపోయానని అనిల్ చెప్పారు.
మెగాస్టార్ కు సహనమెక్కువ
కానీ మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్లీ మెగాస్టార్ ను కలిసి సినిమా చేద్దామని చెప్పగానే తనను నమ్మి అవకాశమిచ్చారని, వేరే వాళ్లైతే ముందు జరిగింది మనసులో పెట్టుకుని దగ్గరకు కూడా రానీయరు కానీ చిరంజీవి గారు అవేవీ మనసులో పెట్టుకోకుండా తనకు ఛాన్స్ ఇచ్చారని, ఆయనకు సినిమా అంటే ఎంతో ఇష్టమని, టెక్నీషియన్లకు ఆయనెంతో విలువిస్తారని, చిరంజీవి గారికి సహనం చాలా ఎక్కువని, మామూలుగా తనకు తానే ఎక్కువ సహనం ఉందని అనుకునే వాడినని, కానీ చిరంజీవి గారిని చూశాక తనది అసలు సహనమే కాదనిపించిందని అనిల్ పేర్కొన్నారు.
