ఆ తప్పు నేను అస్సలు చేయను.. అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడికి తన మేకింగ్ పై ఉన్న నమ్మకం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక నేటివిటీకి తగ్గట్లుగా రాసుకున్న జోకులు లేదా బాడీ లాంగ్వేజ్ ఇతర భాషల వారికి కనెక్ట్ అవ్వకపోతే సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
By: M Prashanth | 22 Jan 2026 10:28 PM ISTటాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి తన స్ట్రెంత్ ఏంటో, తన మార్కెట్ పరిధి ఎంతో చాలా క్లియర్ గా తెలుసు. వరుసగా కమర్షియల్ హిట్లు కొడుతున్నా, ఆయన ఎప్పుడూ లేనిపోని ప్రయోగాలకు పోకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, సినిమా మేకింగ్ మార్కెట్ ట్రెండ్స్ పై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా రీమేక్‌లు పాన్ ఇండియా సినిమాలపై ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అనిల్ రావిపూడి రాసే కథలు, అందులోని కామెడీ టైమింగ్ వేరే భాషల్లోకి రీమేక్ అవ్వడం ఆయనకు సంతోషమే. కానీ, అదే సినిమాలను వేరే భాషల్లో నన్నే డైరెక్ట్ చేయమంటే మాత్రం తాను అస్సలు ఒప్పుకోనని ఆయన ఖరాకండిగా చెప్పారు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేసే ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఒకసారి తీసిన సినిమాను మళ్ళీ తీయడంలో తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
దీని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉందని అనిల్ వివరించారు. ఆయన తీసే సినిమాలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి కామెడీ సినిమాలను పాన్ ఇండియా ప్రాజెక్టుల్లా ఒకేసారి అన్ని భాషల్లో తీయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఒక ప్రాంతంలోని ఆడియన్స్ ఎంజాయ్ చేసే కామెడీ, మరో ప్రాంతం వారికి నచ్చకపోవచ్చు. రీజియన్ బట్టి ఆడియన్స్ పల్స్ మారిపోతుందని, అందుకే కామెడీ సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఇవ్వడం పెద్ద రిస్క్ అని అన్నారు.
అనిల్ రావిపూడికి తన మేకింగ్ పై ఉన్న నమ్మకం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక నేటివిటీకి తగ్గట్లుగా రాసుకున్న జోకులు లేదా బాడీ లాంగ్వేజ్ ఇతర భాషల వారికి కనెక్ట్ అవ్వకపోతే సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే తాను తీసే సినిమాలు మన తెలుగు నేటివిటీకి, మన ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్లుగానే ఉంటాయని ఆయన నమ్ముతారు. కేవలం మార్కెట్ పెరుగుతుందని లేదా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని బలవంతంగా పాన్ ఇండియా కథలు రాయనని తేల్చి చెప్పారు.
ఈ విషయంలో అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోని మిగతా డైరెక్టర్ల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా మంత్రం జపిస్తుంటే, ఆయన మాత్రం తన బలాన్ని నమ్ముకుని రీజినల్ మార్కెట్ లోనే సత్తా చాటాలని చూస్తున్నారు. తన మార్కెట్ మీద తనకు ఉన్న ఈ క్లారిటీ వరుస విజయాల వైపు నడిపిస్తోంది. నిర్మాతలకు సేఫ్ బిజినెస్ గా మారుస్తోంది. తన లిమిట్స్ ఏంటో తెలిసి ప్రవర్తించడం వల్లే రావిపూడి సక్సెస్ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
ఏదేమైనా అనిల్ రావిపూడి ఒక ప్రాక్టికల్ డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. తనకు ఏది వస్తుందో అది మాత్రమే చేస్తానని, రాని దానికోసం ఆరాటపడనని చెప్పిన విధానం ఒప్పుకోదగినదే. బాక్సాఫీస్ దగ్గర తనదైన ముద్ర వేస్తూనే, తన నేటివిటీ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను అలరించడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని క్లారిటీ ఇచ్చేశారు. మరి అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ లో రాబోయే తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.
