ఫైనల్‌గా అనిల్ ఓపెన్ అయ్యాడు!
ఈ నేపథ్యంలోనే 'భగవంత్ కేసరి' డైరెక్టర్ అనిల్ రావిపూడి 'జన నాయగన్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By: Tupaki Entertainment Desk | 11 Jan 2026 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ విజయ్ నటించిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా 'జన నాయగన్'. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసి ఈ మూవీ సెన్సార్ వివాదం కారణంగా రిలీజ్ సందిగ్ధంలో పడిన విషయం తెలిసిందే. మద్రాస్ హైకోర్ట్ సింగిల్ బెంచ్ సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని అదేశాలు జారీ చేసినా ఆ తీర్పుని సీబీఎఫ్‌సీ వర్గాలు సవాల్ చేస్తూ హై కోర్టు డివిజన్ బెంచ్‌ని సంప్రదించడంతో తత్కాలిక స్టే విధించిన న్యాయ స్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ రిలీజ్ ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే విజయ్ 'జన నాయగన్' తెలుగు హిట్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఇటీవల సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ ప్రచారం నిజమని తేలడంతో బాలయ్య క్యారెక్టర్‌లో విజయ్ ఎలా చేశాడనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే 'భగవంత్ కేసరి' డైరెక్టర్ అనిల్ రావిపూడి 'జన నాయగన్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రైలర్‌లో నాలుగు సన్నివేశాలు చూసి 'భగవంత్ కేసరి'ని యథాతథంగా తీశారని అనడం సబబు కాదు అన్నారు.
అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'భగవంత్ కేసరి' రీమేక్‌పై అడిగిన ప్రశ్నకు అనిల్ ఆసక్తికరంగా స్పందించాడు. సినిమా వచ్చే వరకు సోషల్ మీడియాలో చర్చ అనవసరమని చెప్పాడు. `భగవంత్ కేసరి` మూవీ మూల కథను తీసుకుని అక్కడి నేటీవిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుని ఉంటారు. బహుషా ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ ఇలా కొన్ని పార్ట్‌లు యథాతథంగా తీసి ఉండవచ్చు. మిగిలినదంతా మార్చి ఉంటారు.
విలన్ ట్రాక్ మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తోంది. రోబోట్స్ కూడా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్‌ని కూడా జోడించినట్టుగా తెలుస్తోంది. భగవంత్ కేసరి` కంటెంట్ విజయ్ గారికి బాగా నచ్చింది. ఎవరేమనుకున్నా...ఎవరెంత అనుకున్నా సినిమాలో సోల్ బాగుంటుంది. దానికి విజయ్ నటన మరింత బలమవుతుంది. రీమేక్ అనుకున్నప్పుడు ఎవరు తీసినా అలాగే తీయాలి. గతంలో రీమేక్స్ అన్నీ అలా తీసినవే కదా? కరోనా తరువాత రీమేక్స్ తగ్గాయి. అసలు రీమేక్ అంటే ఏమిటి? ఒక భాషలో తీసిన సినిమాని మరో భాషలో తీయడమే కదా! వాళ్లు రీమేక్ అని చెప్పకపోవడానికి కారణం దాని చుట్టూ మరిన్ని విమర్శలు ఎదురవుతాయని భావించి ఉండవచ్చు.
తమిళ ప్రేక్షకులకు ఇది కొత్త కథ. అక్కడి వాళ్లందరూ వచ్చి `భగవంత్ కేసరి` చూడలేదు కదా? హిందీ 'దబాంగ్'ను తెలుగులో 'గబ్బర్‌సింగ్'గా మార్చి బాగా తీశారు. మంచి హిట్ కూడా అయింది. ఒక కథకు అక్కడి హీరో బలాలు కూడా తోడైతే సినిమా మరోలా ఉంటుంది. ఇంకా మనం సినిమాని చూడలేదు. ఆయన ఏం చేశారో చూశాకే మాట్లాడాలి. ట్రైలర్‌లో కొన్ని సీన్‌లని చూసి చర్చ చేయడం అనవసరం. కంటెంట్ బయటకు వస్తేనే మాట్లాడాలి. విజయ్ గారికి ఇది మంచి వీడక్కోలు అవ్వాలని కోరుకుంటున్నా` అన్నారు. అనిల్ ఇప్పటికీ `భగవంత్ కేసరి`ని విజయ్ రీమేక్ చేశాడని చెప్పడం లేదు.. అలా అని కాదనీ చెప్పడం లేదు. సినిమా రిలీజ్ వరకు ఈ సస్పెన్స్‌ని ఇలాగే కంటిన్యూ చేసేలా ఉన్నాడుగా...
