Begin typing your search above and press return to search.

హిట్స్ లో రాజ‌మౌళిలా..డిస్ట్రిబ్యూట‌ర్స్ లో పూరిలా!

హిట్ మెషిన్ అనీల్ రావిపూడిని ద‌ర్శ‌క‌ధీర‌డు రాజ‌మౌళితో పోల్చుతున్నారు. రాజ‌మౌళి త‌ర‌హాలో ఇంత వ‌ర‌కూ ఒక్క వైఫ‌ల్యం కూడా అనీల్ ఖాతాలో లేదు.

By:  Srikanth Kontham   |   23 Jan 2026 12:31 PM IST
హిట్స్ లో రాజ‌మౌళిలా..డిస్ట్రిబ్యూట‌ర్స్ లో పూరిలా!
X

హిట్ మెషిన్ అనీల్ రావిపూడిని ద‌ర్శ‌క‌ధీర‌డు రాజ‌మౌళితో పోల్చుతున్నారు. రాజ‌మౌళి త‌ర‌హాలో ఇంత వ‌ర‌కూ ఒక్క వైఫ‌ల్యం కూడా అనీల్ ఖాతాలో లేదు. ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొమ్మిది సినిమాలు మంచి విజ‌యం సాధించిన‌వే. అందులో రెండు సినిమాలు క‌లిపి 600 కోట్ల‌కుపైగా వ‌సూళ్లు సాధించిన‌వే. మిగిలిన‌ సినిమాలు 100 కోట్ల వ‌సూళ్లు సా|ధించిన‌వి నాలుగు చిత్రాల‌ వ‌ర‌కూ ఉన్నాయి. రాజ‌మౌళి తో సినిమా అంటే నిర్మాత‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చు అవుతుంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న క‌థ‌లు తెర‌కెక్కిస్తారు కాబ‌ట్టి ఆ మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌దు.

కానీ అనీల్ సినిమాలు 50 కోట్ల‌లోనే పూర్తి చేసి వంద‌ల కోట్ల లాభాలు చూపించ‌డం మాత్రం అత‌డికే చెల్లింది. రీజ‌న‌ల్ సినిమా కావాలంటే అనీల్ తో..పాన్ ఇండియా విజ‌యం కావాలంటే రాజ‌మైళితోనూ ముందుకెళ్తే సరి. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య పోలిక ప‌ర్పెక్ట్. అలాగే డిస్ట్రిబ్యూట‌ర్స్ లోనూ అనీల్ అంటే ఓ బ్రాండ్. అత‌డి పేరు మీద‌నే బిజినెస్ అయిపోతుంది. అనీల్ సినిమా అంటే పంపిణీ వ‌ర్గాల్లో ఓ భ‌రోసా. అనిల్ సినిమాలు కొంటే మంచి లాభాలు పొందొచ్చు అన్న‌ది అంద‌రి అభిప్రాయం. సాధార‌ణంగా డిస్ట్రిబ్యూట‌ర్స్ డైరెక్ట‌ర్న్ న‌మ్మ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని.

హీరో ఇమేజ్ ఆధారంగా సినిమాలు కొంటుంటారు. కానీ డైరెక్ట‌ర్ని నమ్మి కొంటే ఊహించ‌ని లాభాలు చూడొచ్చు? అన్న భ‌రోసా తొలుత క‌ల్పించింది పూరి జ‌గ‌న్నాధ్. పూరి ఫాంలో ఉన్నంత కాలం డిస్ట్రిబ్యూటర్స్ పూరి అనే బ్రాండ్ చూసే కొనేసేవారు. అందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఆలోచ‌న లేకుండా ముందుకెళ్లేవారు. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో చాలా మంది స‌క్స‌స్ పుల్ ద‌ర్శ‌కులున్నారు. కానీ ఏ డైరెక్ట‌ర్ ఇవ్వ‌ని న‌మ్మ‌కాన్ని పూరి ఇచ్చాడు. అందుకే పూరి డిస్ట్రిబ్యూట‌ర్స్ లో ఓ బ్రాండ్ అయ్యాడు. కానీ వ‌రుస వైఫ‌ల్యాలు అత‌డిపై న‌మ్మ‌కాన్ని కోల్పోయేలా చేసాయి.

పూరి స్థానంలో ఇప్పుడు అనీల్ రావిపూడి సినిమాలు పంపిణీదారుల‌కు ఆ న‌మ్మకాన్ని క‌లిగిస్తున్నాయి. అనీల్ తెర‌కెక్కించిన తొమ్మిది సినిమాలు మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌వే. పైగా ఆ సినిమాల బ‌డ్జెట్ ని మించి రెండింత‌లు అధిక లాభాలు తెచ్చి పెట్టాయి. అనీల్ రావిపూడి 10వ సినిమా త్వ‌ర‌లో మొద‌ల‌వుతుంది. అందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా డిసైడ్ అవ్వ‌లేదు. ఇప్ప‌టికే స్టోరీ లైన్ లాక్ అయింది. అదీ త‌న‌కు బాగా కలిసొచ్చిన వైజాగ్ వెళ్లే మార్గంలో లైన్ త‌ట్ట‌డం విశేషం. స్టోరీ కూడా అదే వైజాగ్ పార్క్ హోట‌ల్ బీచ్ ముందు రెడీ అవుతుంది. అనీల్ రాసిన పాత్ర‌కు ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో ముందుకెళ్తాడు.