MSG: 5 రోజులు ఎక్కువయ్యాయని అనిల్ ఫీలయ్యారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది.
By: M Prashanth | 13 Jan 2026 1:22 PM ISTఅనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించడంతో ఆ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది.
ఈ సందర్భంగా సినిమా షూటింగ్ అనుభవాలపై దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, షూటింగ్ ప్లానింగ్, ఖర్చుల గురించి ఆయన ఓపెన్ గా వివరించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ, సినిమాను 80 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనే ప్లాన్ తోనే ప్రారంభించామని, కానీ అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు.
"ముఖ్యంగా వర్షాలు, స్ట్రైక్ కారణంగా డేట్స్ క్లాష్ అయ్యాయి. దాంతో షూటింగ్ షెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ అయింది. అనుకున్న దానికన్నా ఐదు నుంచి ఆరు రోజులు ఎక్కువ పట్టింది. దానికి నాకు చాలా బాధగా అనిపించింది" అని తెలిపారు. అదే సమయంలో షూటింగ్ ఆలస్యం వల్ల వచ్చే అదనపు ఖర్చుల గురించి కూడా అనిల్ రావిపూడి ప్రస్తావించారు.
"ఒక రోజు షూటింగ్ ఎక్కువైతే సుమారు రూ.25 నుంచి రూ.28 లక్షల వరకు అదనపు ఖర్చు అవుతుంది. అలాంటిది ఐదు రోజులు అదనంగా షూటింగ్ చేయాల్సి వస్తే రూ.కోటికిపైగా ఖర్చు పెరుగుతుంది. అందుకే వర్కింగ్ డేస్ అనేవి సినిమా ప్రొడక్షన్ లో చాలా కీలకం. ఒక రోజు కూడా చాలా విలువైనది" అని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
డైరెక్టర్ బాధ్యతలు ఎంత కష్టంగా ఉంటాయో కూడా ఆయన వివరించారు. "డైరెక్టర్ పని చూడటానికి ఈజీగా అనిపించొచ్చు. కానీ వాస్తవానికి చాలా కష్టం. షూటింగ్ సమయంలో పూర్తిగా సినిమాకే అంకితం కావాలి. ముందు రోజు రేపటి సీన్స్ గురించి చర్చించాలి. షూటింగ్ చేయాలి. షూట్ అయిన సీన్స్ ని ఎడిటింగ్ లో చూసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్ట్రెస్ తో ఉంటుంది" అని చెప్పారు.
అంతేకాదు, షూటింగ్ సమయంలో నిద్ర కూడా సరిగ్గా ఉండదని వెల్లడించారు. "నిద్రలు ఉండవు. సినిమా పూర్తయ్యే వరకు, రిలీజ్ అయ్యే వరకు, అది అందంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు డైరెక్టర్ భుజాల మీదే ఆ భారం ఉంటుంది. షూటింగ్ మాత్రమే కాదు.. సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం" అన్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలవుతామని, అప్పటివరకు ఎదురైన కష్టాలన్నీ మర్చిపోతామని చెప్పారు. మంచి రిజల్ట్ వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమని పరోక్షంగా తెలిపారు.
