ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత విజయాలతో సినిమా హక్కుల ధరలు పెరగడంతో బయ్యర్లకు ఈసారి లాభాలు అందుకోవడం సవాలుగా మారింది. సంక్రాంతి పోటీ, భారీ బిజినెస్ మధ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
By: M Prashanth | 20 Nov 2026 11:01 PM ISTసంక్రాంతికి సినిమా తీసుకొస్తే అనిల్ రావిపూడికి హిట్ పక్కా అనే నమ్మకం బాగా పెరిగిపోయింది. గత రెండు సంక్రాంతుల్లో భారీ విజయాలు అందుకోవడంతో ఇప్పుడు బయ్యర్లు కూడా అనిల్ సినిమాల కోసం పోటీ పడుతున్నారు. వెంకటేశ్‌తో మరోసారి కలిసి వస్తుండటం, ఈసారి కళ్యాణ్‌రామ్ కూడా తోడవడంతో క్రేజ్ మరింత పెరిగింది. అయితే గతంలో మాదిరిగా ఈసారి కూడా భారీ లాభాలు అందుకోవడం అంత సులభం కాకపోవచ్చు. దానికి అసలు కారణం పెరుగుతున్న బిజినెస్ ధరలే.
గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' బయ్యర్లకు మంచి లాభాలు అందించింది. ముఖ్యంగా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి రూ.1.62 కోట్లకు హక్కులు తీసుకుంటే, పెట్టుబడిపై 400 శాతానికి పైగా రాబడి వచ్చిందని స్వయంగా చెప్పారు. చాలా ఏరియాల్లో ఇలాంటి లాభాలే వచ్చాయి. దీంతో అనిల్ సినిమాలపై ట్రేడ్‌లో నమ్మకం పెరిగింది. కానీ అదే ఇప్పుడు కొత్త సినిమా హక్కుల ధరలు పెరగడానికి కారణమవుతోంది.
'జనవరి 12 విడుదల' నైజాం హక్కులను దిల్ రాజు సంస్థ రూ.25 కోట్ల నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌తో తీసుకున్నట్లు సమాచారం. సీడెడ్‌లో రూ.12 కోట్లకు బిజినెస్ జరిగిందట. ఆంధ్రా హక్కుల కోసం రూ.35 నుంచి 40 కోట్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే బిజినెస్ రూ.72 నుంచి 77 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఆంధ్రా డీల్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.
ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వసూలు చేయాలి. గతసారి తక్కువ ధరకు హక్కులు తీసుకున్నవాళ్లకు భారీ లాభాలు వచ్చాయి. ఈసారి హక్కుల ధరలే పెరిగిపోవడంతో హిట్ టాక్ వచ్చినా ప్రాఫిట్స్ గతంలో మాదిరిగా ఉండకపోవచ్చు. పైగా సంక్రాంతికి ఎక్కువ సినిమాలు వస్తే థియేటర్లను పంచుకోవాల్సిందే. మొదటి వారంలో మంచి వసూళ్లు వచ్చినా ఆ తర్వాత కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తేనే భారీ లాభాలు సాధ్యమవుతాయి.
మరోవైపు అనిల్‌కు గత రెండు సంక్రాంతుల్లో ఎదురైన పరిస్థితి కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి 'కాకా'తో పాటు శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్', మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి. వాటిలో ఎన్ని సినిమాలు చివరకు బరిలో ఉంటాయనేది ఇంకా క్లారిటీ లేదు. గతంలో వెంకీ సోలో ఎంటర్టైన్మెంట్తో భారీ విజయం అందుకున్నారు. ఈసారి ఇద్దరు హీరోలతో వస్తుండటంతో కథ, కామెడీ కూడా ఆ స్థాయిలోనే వర్కౌట్ కావాల్సి ఉంటుంది.
ఇక గతంలో 'సంక్రాంతికి వస్తున్నాం' నిర్మించిన దిల్ రాజు ఈసారి నైజాం డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం విశేషం. సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 2027 జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలవుతున్నాయి. ఇప్పటికే అనిల్ గత విజయాల కారణంగా బిజినెస్ రేట్లు పెరిగాయి. ఇక విడుదలకు ముందే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
