Begin typing your search above and press return to search.

హిట్ మెషిన్ ప్ర‌యోగాలు..ప్రాజెక్టులు!

అనీల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అయింది.

By:  Srikanth Kontham   |   4 Aug 2026 12:48 PM IST
హిట్ మెషిన్ ప్ర‌యోగాలు..ప్రాజెక్టులు!
X

అనీల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అయింది. దీంతో హీరోల పాలిట అనీల్ బంగారు బాతులా మారిపోయారు. హీరోలంతా ఇప్పుడు అత‌డి కోసం క్యూ క‌డుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌లను అందిస్తూ హిట్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న అనీల్ ఇప్పుడు శైలిని మార్చుకుంటూ సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా విభిన్నమైన జోనర్లలో సినిమాలను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ విక్ట‌రీ వెంకటేష్- నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లలో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మరోసారి తన మార్క్ కామెడీతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ క‌థ పెద్ద‌గా కొత్త‌గా ఏమీ ఉండ‌దు. రొటీన్ గా క‌నిపించినా? అందులో అనీల్ మార్క్ మ్య‌జాకి్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తికాగానే అనీల్ తదుపరి చేయబోయే సినిమాలపై ఇండస్ట్రీలో అంచనాలు మొద‌ల‌వుతున్నాయి.

ఎప్పుడూ ఒకే జోనర్‌లో కాకుండా కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటపడాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు తెరపై వినూత్నమైన యానిమేషన్ సినిమాను తెరకెక్కించడానికి సన్నా హాలు చేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాల‌తో రానున్న యానిమేషన్ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ యానిమేషన్ ప్రయత్నం తర్వాత నందమూరి బాలకృష్ణ ..అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ రెండు సినిమా క‌థ‌లు మాత్రం రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉంటాయ‌నే లీక్ అందింది.

రొటీన్ అంశాన్ని ప‌క్క‌న బెట్టి ఓ కొత్త పాయింట్ తోనే నాగ్, బాల‌య్య‌ల‌తో సినిమాలు చేస్తార‌ని అంటున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోల‌తో అనీల్ డిస్క‌ష‌న్ చేసిన‌ట్లు..వారు కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. బాల‌య్య తో ఇప్ప‌టికే `భ‌గ‌వంత్ కేస‌రి` కోసం ప‌ని చేసారు కాబ‌ట్టి అత‌డితో ప్ర‌యోగం పెద్ద విష‌యం కాదు. నాగార్జున ఆ ఛాన్స్ తీసుకుంటారా? అన్న సందేహం ఉంది. ఎందుకంటే నాగార్జున‌కు ప్ర‌యోగాలు పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు.

ఫ్యామిలీ జోన‌ర్లు ఇచ్చిన‌ విజ‌యాలు ప్ర‌యోగాలు ఇవ్వ‌డం లేదు. అందులోనూ అనీల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు స్పెష‌లిస్ట్. అలాంటి ద‌ర్శ‌కుడితో నాగ్ ప్ర‌యోగాలు చేసే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌నే తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది. ఇదే నిజ‌మైతే? కెరీర్ పరంగా వరుస విజయాలు అందుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి ప్రయోగాత్మక మార్గాన్ని ఎంచుకోవడం అభినందనీయం. ఒకవైపు కమర్షియల్ మాస్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యానిమేషన్ వంటి విభిన్న జోనర్లలో సత్తా చాటాలని చూస్తుండటం ఆయనలోని వైవిధ్యాన్ని చాటుతోంది. దర్శకుడిగా అనీల్ పరిధిని మరింత విస్తృతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.