Begin typing your search above and press return to search.

అనిల్ ఆ రికార్డు సృష్టిస్తారా?

అయితే అలా ఒక్కో జనరేషన్ కి చెందిన ఇద్దరు ముగ్గురు హీరోలతో డైరెక్టర్లు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు.

By:  Madhu Reddy   |   11 Jan 2026 4:27 PM IST
అనిల్ ఆ రికార్డు సృష్టిస్తారా?
X

ఒక్కో జనరేషన్ లో కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ , కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి దిగ్గజ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకొని తమకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత జనరేషన్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఇక ఆ తర్వాత జనరేషన్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఒక్కో జనరేషన్లో కొంతమంది హీరోలు తమకంటూ ఒక గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే అలా ఒక్కో జనరేషన్ కి చెందిన ఇద్దరు ముగ్గురు హీరోలతో డైరెక్టర్లు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక పూర్తి జనరేషన్తో సినిమాలు చేసి ఆ రికార్డును తానే సొంతం చేసుకుంటాను అని చెబుతున్నారు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా వెంకటేష్, చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేశారు. ఈ ఇద్దరి హీరోల కలయికలో వచ్చిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు..

అసలు విషయంలోకి వెళ్తే.. సీనియర్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో ఇప్పటికే వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ఆ తర్వాత బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేసి ఆ కోరికను తీర్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. మిగిలింది నాగార్జున మాత్రమే.

ఇదే విషయంపై ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేశాను. ఇప్పుడు మిగిలింది నాగార్జున మాత్రమే. ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తారని అందరూ అడుగుతున్నారు. ఆయనతో కూడా ఒక సినిమా చేయాలని నాకు కూడా ఉంది. ముఖ్యంగా ఆ సినిమా చేస్తే ఈ నలుగురు అగ్ర హీరోలతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా రికార్డు నాదే అవుతుంది. అయితే తదుపరి సినిమాపై ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నా కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను అంటూ అనిల్ రావిపూడి తెలిపారు. మొత్తానికైతే నాగార్జునతో సినిమా చేసి ఆ రికార్డు సొంతం చేసుకోవాలని అభిమానులు కూడా కోరుతున్నారు.

నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో తన 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా 100 కోట్ల క్లబ్లో చేరిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.