Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ల సెంటిమెంట్!

సాధారణంగా చాలా మంది దర్శకులు అలవాటైన పాత టెక్నికల్ టీమ్‌ను పదే పదే రిపీట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అనిల్ రావిపూడి కూడా తన ఎడిటర్లు, రైటింగ్ టీమ్‌ను పెద్దగా మార్చ‌రు.

By:  Srikanth Kontham   |   28 May 2026 10:00 PM IST
అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ల సెంటిమెంట్!
X

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అనిల్ రావిపూడి. తన సినిమాల్లో కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఎంత పక్కాగా ఉంటాయో? తెరవెనుక సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా అంతే ప్లానింగ్‌తో ఉంటుంది. సాధారణంగా చాలా మంది దర్శకులు అలవాటైన పాత టెక్నికల్ టీమ్‌ను పదే పదే రిపీట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అనిల్ రావిపూడి కూడా తన ఎడిటర్లు, రైటింగ్ టీమ్‌ను పెద్దగా మార్చ‌రు. కానీ సంగీత దర్శకుల విషయంలో మాత్రం ఓ సెంటిమెంట్‌ను .. పక్కా వ్యూహాన్ని అనుసరిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి కెరీర్ ప్రారంభాన్ని గమనిస్తే ఆయన మొదటి మూడు చిత్రాలకు ఒకే సంగీత దర్శకుడిని నమ్ముకున్నారు. కెరీర్ ఆరంభంలో వచ్చిన సినిమాలకు సాయి కార్తీక్ తో కలిసి పనిచేశారు. ఆ మూడు సినిమాలు మ్యూజికల్‌గా ..కమర్షియల్‌గా మంచి విజయాలను సాధించాయి. ఒక కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడే క్రమంలో తనకు కంఫర్ట్‌గా ఉండే టెక్నీషియన్‌తో ట్రావెల్ చేయడం అనిల్ రావిపూడికి బాగా ప్లస్ అయింది. ఆ సమయంలో వారి కాంబినేషన్‌లో వచ్చిన మాస్ బీట్స్ కమర్షియల్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.

అయితే ఆ మొదటి మూడు చిత్రాల విజయాల తర్వాత అనిల్ రావిపూడి తన మ్యూజికల్ లైనప్‌ను పూర్తిగా మార్చేశారు. తదుపరి మూడు చిత్రాలైన `ఎఫ్2`, `సరిలేరు నీకెవరు`, `ఎఫ్3` సినిమాల కోసం ఆయన స్టార్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్‌ తో చేతులు కలిపారు. వరుసగా ఈ మూడు పెద్ద ప్రాజెక్టులకు దేవిశ్రీ అందించిన ఆల్బమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. దీనితో ప్రతి మూడు సినిమాలకు ఒకసారి సంగీత దర్శకుడిని మార్చే విభిన్నమైన సెంటిమెంట్ అనిల్ రావిపూడి కెరీర్‌లో బలంగా వినిపించడం ప్రారంభమైంది.

దేవిశ్రీ ప్రసాద్‌తో మూడు సినిమాల ప్రయాణం ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి మళ్లీ కొత్త కాంబినేషన్ల వైపు అడుగులు వేశారు. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన `భగవంత్ కేసరి` చిత్రం కోసం ఆయన టాలీవుడ్ టాప్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్‌ ను రంగంలోకి దించారు. ఆ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం `సంక్రాంతికి వస్తున్నాం` కోసం మాస్ పల్స్ తెలిసిన భీమ్స్ సిసిరోలియో తో కనెక్ట్ అయ్యారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియోను ఈ చిత్రంతో ప్రేక్షకులకు అందించారు.

ప్రస్తుతం అనీల్ రావిపూడి టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం `సంక్రాంతికి వస్తున్నాం` ఫేమ్ భీమ్స్‌ను కొనసాగిస్తారని అంతా భావించినా? అనిల్ రావిపూడి మరోసారి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రానికి సరికొత్త ఆడియో ఫీల్ ఫ్రెష్‌నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో భీమ్స్‌ను కాదని, కోలీవుడ్ స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుని సర్ప్రైజ్ చేశారు.

ఇలా అనిల్ రావిపూడి అనుసరిస్తున్న మ్యూజికల్ చేంజెస్ ట్రెండ్ కమర్షియల్ సినిమాలకు ఎంతో అవసరమైన ఆడియో ఫ్రెష్‌నెస్‌ను అందిస్తోంది. ఒకే రకమైన శైలికి పరిమితం కాకుండా ప్రతి చిత్రానికి లేదా కొన్ని చిత్రాల విరామం తర్వాత భిన్నమైన సంగీత దర్శకులను ఎంచుకోవడం వల్ల సినిమాల్లో కొత్తదనం కనిపిస్తుంది. తెరవెనుక కమాండ్ కోసం కొంతమంది టెక్నీషియన్లను రిపీట్ చేస్తూనే ఆడియో పరంగా మాత్రం నిరంతరం ప్రయోగాలు చేసే అనిల్ రావిపూడి మార్క్ స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఆయన మల్టీస్టారర్ చిత్రానికి ఏ స్థాయి మ్యూజికల్ సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.