ఆ డైలాగ్ మరో చోట పెట్టాల్సింది : అనిల్ రావిపూడి
ఇంకా పలు ఆసక్తికర విషయాలను, మేకింగ్ వివరాలను అనిల్ రావిపూడి ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నాడు.
By: Ramesh Palla | 24 Jan 2026 1:40 PM ISTసంక్రాంతికి వచ్చి మరో హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలతో దుమ్ము రేపిన అనిల్ సినిమా విడుదల తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకున్నాడు. చిరంజీవి విదేశాల్లో ఉన్నారు, హీరోయిన్ వచ్చే పరిస్థితి లేదు, నిర్మాతలతో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను ప్రమోట్ చేస్తూ, మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్‌లో కచ్చితంగా రూ.400 కోట్లకు మించి నమోదు చేస్తుందనే విశ్వాసంను తాజా ఇంటర్వ్యూలో అనిల్ వ్యక్తం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను, మేకింగ్ వివరాలను అనిల్ రావిపూడి ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నాడు.
మన శంకరవరప్రసాద్ గారు సినిమా...
తాజా ఇంటర్వ్యూల్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఎక్కువగా టెన్షన్ పడ్డ ఎపిసోడ్స్ అంటే బుల్లి రాజు కనిపించిన సీన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజుగా ఆకట్టుకున్న వాడిని ఈ సినిమాలో మరింత ప్రేక్షకులు ఆశిస్తారు. అలాగే అతడి పాత్ర ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ అంచనాలను రీచ్ అవుతామా అనే భయం ఉండేది. విడుదలకు ముందు రోజు వరకు బుల్లిరాజు పాత్ర విషయంలో టెన్షన్ పడ్డాం. చిరంజీవి గారితో ఎలాంటి బెరుకు లేకుండా వాడు చేసిన యాక్టింగ్, వాడి డైలాగ్ మాడ్యులేషన్ అన్నింటికి మించి, వాడి క్యూట్ యాక్టింగ్‌తో సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాంలో మాదిరిగా ఈ సినిమాలో అతడి పాత్ర మరింత ఎక్కువ ఉంటే బాగుండేది అని చాలా మంది సినిమా చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవితో బుల్లి రాజు పాత్ర...
చిరంజీవి గారితో ఒక సీన్ లో బుల్లిరాజు నన్ను దత్తత తీసుకోండి సర్, చెర్రీ పక్కన్న కర్రీలా పడి ఉంటాను అంటాడు. ఆ డైలాగ్ సినిమాలో ఉంది. కానీ ఫ్లోలో ఇలా వచ్చి అలా వెళ్లి పోవడంతో ప్రేక్షకులు కనీసం ఆ డైలాగ్ ను నోటీస్ చేయలేక పోతున్నారు. దర్శకుడు స్వయంగా చెప్పే వరకు నిజంగా ఆ డైలాగ్ ఉందా అనిపిస్తుంది. బుల్లి రాజు ఆ డైలాగ్ చాలా క్యూట్ గా చెప్పాడు. చెర్రీ పక్కన్న కర్రీలా పడి ఉంటాను, దత్తత తీసుకోండి అంటూ బుల్లి రాజుతో చిరంజీవి గారి వద్ద డైలాగ్ చెప్పించాం, కానీ దాన్ని మరింత హైలైట్ అయ్యే విధంగా, మరో చోట ఆ డైలాగ్ పెట్టి ఉంటే తప్పకుండా ఇప్పుడు ఆ డైలాగ్ మారు మ్రోగుతూ ఉండేది అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఆ డైలాగ్ ఉన్న విషయాన్ని కూడా ప్రేక్షకులు గుర్తించలేనంత ఫ్లోలో డైలాగ్ వచ్చి వెళ్లడం వల్ల చాలా మంది దాన్ని నోటీస్ చేయక పోవడం వల్ల వైరల్ కావడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మన శంకరవర ప్రసాద్ గారు కలెక్షన్స్...
ఓవరాల్‌గా సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతే కాకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని, రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తుంది. ఇంతకు మించి ఏం కావాలి అన్నట్టుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను చాలా ఏళ్లుగా చూడని ప్రేక్షకులు సైతం థియేటర్ కి వచ్చి ఈ సినిమాను చూస్తున్నారు. సంక్రాంతి సీజన్ కి మొదలైన జోరు ఈ వారం కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ వీకెండ్ కి మరో మైలు రాయిని చేరుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ శని, ఆదివారాల్లో సినిమా రన్ పూర్తి అయ్యే అవకాశం ఉంటుందని, వచ్చే వారం థియేటర్‌లలో ఉన్నా ప్రేక్షకులు ఎంత వరకు వస్తారు అనేది నమ్మకం లేదు. కనుక ఈ వారం అత్యధికంగా వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
