Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ బర్త్‌డేను ఫుల్‌గా క్యాష్ చేసుకున్న అనిల్ రావిపూడి!

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ #VenkyAnil5 (#NKRAR2) నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 July 2026 11:47 AM IST
కళ్యాణ్ రామ్ బర్త్‌డేను ఫుల్‌గా క్యాష్ చేసుకున్న అనిల్ రావిపూడి!
X

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం ప్రత్యేక కానుక అందించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ #VenkyAnil5 (#NKRAR2) నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ పూర్తి సంప్రదాయ దుస్తుల్లో, పంచెకట్టు- కుర్తా ధరించి, స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో కనిపించడం విశేషం. మెడలో పూలమాల, చుట్టూ పండుగ వాతావరణాన్ని తలపించే డెక‌రేష‌న్లు, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఆయన లుక్ సినిమా టోన్ ఎలా ఉండబోతుందో తెలియ‌చేస్తుంది.




ఈ సినిమాను అనిల్ రావిపూడి తనకు ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శైలిలోనే రూపొందిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు లభించాయి. అయితే ఈసారి వెంకటేష్, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను సమాన ప్రాధాన్యంతో కథలో మిళితం చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కామెడీ, ఎమోష‌న్స్, ఫ్యామిలీ బాండింగ్స్, పండుగ సందడి వంటి అంశాల మేళవింపుతో ఆడియ‌న్స్ ను అలరించే కథను అనిల్ రెడీ చేసిన‌ట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణంలో తొలి అవకాశాన్ని ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ అని గుర్తు చేసుకుంటూ, కొత్త డైరెక్ట‌ర్ గా తనపై నమ్మకం ఉంచిన ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త కోణంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని వెల్లడిస్తూ, మరోసారి త‌మిద్దరి కాంబినేషన్ ప్రత్యేకంగా నిలుస్తుందని సంకేతాలు ఇచ్చారు.

అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చింది. 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనిల్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. పండుగ సీజన్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి వినోదాన్ని అందించే టార్గెట్ తో సినిమా రూపొందుతున్నట్లు ఈ అనౌన్స్‌మెంట్ తో అర్థమవుతోంది. ఇప్పటికే సంక్రాంతి రిలీజుల లిస్ట్ లో ఈ సినిమా చేరడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కాగా రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌గా, ఆల్రెడీ ఓ పాట‌ను కూడా షూట్ చేశారంటే అనిల్ ఎంత వేగంగా సినిమాను తెర‌కెక్కిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాదు, ఎప్పుడో సంక్రాంతి రిలీజ్ కు అప్పుడే క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమా ప్ర‌మోష‌న్స్ ను కూడా అనిల్ చాలా ముందుగానే ప్ర‌క‌టించ‌డం ఆయ‌న స్టైల్ ఆఫ్ ప్ర‌మోష‌న్స్ కు అద్దం ప‌డుతుంది.

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మరో కొత్త అడుగు కూడా వేశారు. తన అఫీషియ‌ల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను స్టార్ట్ చేస్తూ అదే వేదికగా ఫస్ట్‌లుక్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి ఎనర్జీతో పనిచేయడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుందని, 2027 సంక్రాంతికి ప్రేక్షకులందరికీ భారీ ఎంట‌ర్టైన్మెంట్ రెడీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతోంది. పటాస్ తర్వాత అనిల్ రావిపూడి- కళ్యాణ్ రామ్ కలయికలో వస్తున్న ఈ సినిమా, వెంకటేష్ జతకావడంతో సంక్రాంతి 2027లో అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.