Begin typing your search above and press return to search.

రాజమౌళి దొరికినా.. రావిపూడి దొరికేలా లేడు..

‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచి అనిల్ రావిపూడి మీద సోషల్ మీడియాలో మళ్లీ కామెంట్స్ మొదలయ్యాయి.

By:  M Prashanth   |   20 Aug 2026 2:00 PM IST
రాజమౌళి దొరికినా.. రావిపూడి దొరికేలా లేడు..
X

‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచి అనిల్ రావిపూడి మీద సోషల్ మీడియాలో మళ్లీ కామెంట్స్ మొదలయ్యాయి. కొందరికి ఈ పేరు వెంటనే నచ్చేస్తే, మరికొందరు మాత్రం మరీ రిలీజ్ డేట్‌నే టైటిల్ చేసేశాడేంటి అంటున్నారు. నిజానికి అనిల్ సినిమాలకు ఇలాంటి రియాక్షన్స్ కొత్త కాదు. సినిమా కంటెంట్, కామెడీ మీద కూడా రిలీజ్‌కు ముందు, తర్వాత రెండు రకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ బాక్సాఫీస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన లెక్క ఇప్పటివరకు తప్పలేదు.

ముఖ్యంగా సంక్రాంతి అంటే అనిల్‌కు బాగా కలిసొచ్చింది. ‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు.. పండగకు వచ్చిన నాలుగు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. వరుసగా 2025లో వెంకటేష్‌తో, 2026లో చిరంజీవితో పెద్ద హిట్లు కొట్టాడు. ఇప్పుడు 2027 సంక్రాంతికి కూడా ముందే సీటు వేసుకుని కూర్చున్నాడు.

అందుకే సోషల్ మీడియాలో మరో వాదన కూడా ఉంది. అనిల్ సినిమాల్లో కొన్ని కామెడీ సీన్స్ అందరికీ నచ్చకపోవచ్చు. కొన్ని క్యారెక్టర్స్ మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంది. కానీ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌కు వెళ్లినప్పుడు సరదాగా చూసే సినిమా కావాలనుకునే ప్రేక్షకులు కూడా చాలామందే ఉంటారు. గత రెండు సంక్రాంతుల్లో అనిల్ సినిమాలకు ఫ్యామిలీస్ వచ్చిన తీరు చూస్తే ఆ లెక్కను పూర్తిగా పక్కన పెట్టలేం.

ఇప్పుడు కొందరు సరదాగా ‘రాజమౌళి అయినా దొరుకుతాడేమో కానీ.. రావిపూడి దొరకడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి సినిమాలను పోల్చడం ఇక్కడ విషయం కాదు. రాజమౌళి కెరీర్‌లో ఇప్పటివరకు అపజయం లేదు. అనిల్ కూడా ‘పటాస్’ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు తొమ్మిది సినిమాలు పూర్తి చేశాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఫ్లాప్ పడలేదు. ఒక సినిమా కాదు.. పదేళ్లకు పైగా ఇదే ట్రాక్ కొనసాగించడం వల్లే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.

పైగా కొత్త సినిమాలో అనిల్‌కు బాగా తెలిసిన వెంకటేష్ ఉన్నాడు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. మరోవైపు తన మొదటి సినిమా ‘పటాస్’ హీరో కళ్యాణ్ రామ్‌ను కూడా ఈసారి తీసుకొచ్చాడు. వెంకీ, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా కనిపించనుండగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్. జనవరి 12నే రిలీజ్ అని టైటిల్‌తోనే ముందుగా చెప్పేశారు.

ఇప్పుడు టైటిల్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా అనిల్‌కు కావాల్సింది మాత్రం థియేటర్‌లో అదే పాత లెక్క వర్కవుట్ కావడం. వరుసగా రెండు సంక్రాంతులకు హిట్ కొట్టి మూడో ఏడాది కూడా అదే పండగను ఎంచుకున్నాడు. ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను పట్టుకుంటే మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ‘రావిపూడి దొరకడు’ కామెంట్ ఇంకొంతకాలం అలాగే తిరుగుతుంది.